ఖమ్మంలో గాంధీ అడుగిడిన చిత్రం (ఫైల్)
- - నేడు జాతిపిత జయంతి
- - ఆయన పేరు మీదే గాంధీచౌక్
- - నేటికీ ఆయన బాటలో గాంధేయవాదులు
- ఖమ్మంతో అనుబంధం
- స్వాతంత్ర్య ఉద్యమకాలంలో దక్షణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చిన మహాత్ముడు విజయవాడ నుంచి రైలులో వెళ్తూ ఖమ్మం స్టేషన్‌లో ఆగారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మంమెట్టులోని పెద్ద గేటు (వెంకటగిరి గేటు, ప్రస్తుతం ఇక్కడ వంతెన నిర్మించారు)వద్ద రైలు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమకారులతో మాట్లాడారు. గాంధీ రాక సందర్భంగా జిల్లాలోని ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఖమ్మం చేరుకొని ప్రసంగాన్ని విన్నారు. ఆయన పేరుమీదే ఖమ్మంలోని గాంధీచౌక్‌ను ఏర్పాటు చేశారు. ఆయన మాటలు విన్న, ఆయనను చూసిన కొందరు ఆయన విధానాలను నేటికీ పాటిస్తున్నారు. వారిలో ఖమ్మానికి చెందిన ఇద్దరు గాంధేయవాదులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
- అహింసే ఆయుధంగా..: శిరం వినాయక హన్మంతరావు
- గాంధీ సంఘ సంస్కర్త కూడా: పెనుగొండ రామ్మోహన్‌రావు
ఖమ్మం గాంధీచౌక్:
స్వాతంత్ర్య ఉద్యమకాలంలో దక్షణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన గాంధీ అక్కడి నుంచి రైలులో వెళ్తూ ఖమ్మం స్టేషన్‌లో ఆగారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మంమెట్టులోని పెద్ద గేటు (వెంకటగిరి గేటు)వద్ద రైలు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమకారులతో మాట్లాడారు. గాంధీ రాక సందర్భంగా జిల్లాలోని ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఖమ్మం చేరుకొని ప్రసంగాన్ని విన్నారు. కొద్ది క్షణాలపాటే సాగిన ఆ ప్రసంగం నాటి యువతలో ఎనలేని స్ఫూర్తినింపింది. మహాత్ముని 147వ జయంతి సందర్భంగా ‘సండే స్పెషల్’గా ఆ నాటి స్మృతులు.. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌లో 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ అహింసే ఆయుధంగా స్వాతంత్రోద్యమం నడిపారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించారు. మహాత్ముడిగా వెలుగొందిన గాంధీ 1948 జనవరి 30న ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనకు వెళ్తుండగా గాడ్సే చేత చంపబడ్డారు. జాతిపిత మహాత్మగాంధీ 147వ జయంతిని ఆదివారం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీకి ఖమ్మంతో ఉన్న అనుబంధాన్ని ఓసారి మననం చేసుకుందాం..
మహాత్ముడు గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన అహింస, సత్యాగ్రహాలను ఆయుధాలుగా వాడుకున్నారు. ఆ విధానం దేశం యావత్తు గర్వించదగినది. బారిస్టరు చదివిన గాంధీజీ ఎంతో నీతి నిజాయితీగా ఉండటంతోనే ఉద్యమంలో రాణించారు. యావత్తు దేశం ఆయనను గర్వంగా మహాత్మునిగా పిలుచుకోవడం మరువ లేనిది. ఆయన మార్గదర్శకత్వంలో జీవనం సాగిస్తున్నాం. ‘దేశంలో మార్పు కోరుకుంటే మొదట నీ నుంచే ప్రారంభం కావాలి..’ అనే మహాత్ముని సూత్రం నాకే కాదు యావత్ జాతికి స్ఫూర్తినిచ్చింది. ‘నాదగ్గర ప్రేమ తప్ప మరొక ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నాగమ్యం’ అన్న ఆయన మరో నినాదం దేశవిదేశాలతో స్నేహసంబంధాలను నెరపేందుకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. ఇలాంటివెన్నో విషయాలు మహాత్ముని నుంచి మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుత సమాజానికి ఇవి ఎంతో అవసరం కూడా.
మహాత్మాగాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధుడే కాదు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త కూడా. నేడు స్వచ్ఛ భారత్‌గా చెప్పుకునే విధానం ఆయనదే. ఆయన గొప్ప చదువులు చదివినా మురికి వాడల్లో తిరుగుతూ చీపిరి పట్టుకొని వీధులు ఊడ్చి సంఘంలో ఆదర్శంగా నిలిచారు. అంటరానితనం నిర్మూలనకు నడుం బిగించారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవిస్తున్నాం. ‘వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి, తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే..’ అన్న గాంధీ సూత్రం వ్యక్తిత్వం అనేది మనిషికి ఎంత అవసరమో తెలియజెబుతోంది. ‘విధి నిర్వహణకు మించిన దేశ సేవలేదు’ అన్న గాంధీ మరో నినాదం మన విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తుంది. ‘ఔన్నత్యం సంపద వలన రాదు.. సద్గుణాల వలన వస్తుంది’ అనే నినాదం ధనం చుట్టూ పరుగులు పెడుతున్న నేటి మానవాళికి ఓ చెంపపెట్టు.