నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.
గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్‌లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్‌లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.
1923లో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి బొమ్మలు ఎంతగా నచ్చాయంటే, ఆయన వాటిని తన టేబుల్‌పై పెట్టుకున్నారు.
గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్‌పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986 జనవరి 9న కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
Comments
Please login to add a commentAdd a comment