పకడ్బందీగా ఓటర్ల జాబితా
డూప్లికేట్ ఓటర్లను తొలగించాలి
– ఓటర్ల జాబితాలోని తప్పులను సత్వరం సరిచేయాలి
– పట్టణ ప్రాంతాల్లో ఇక 1000 – 1100 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సూచనలు
కర్నూలు(అగ్రికల్చర్): 2019 సాధారణ ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా బోగస్ ఓటర్లకు తావు లేకుండా పకడ్బందీగా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ అతిథిగహంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో జాతీయ ఓటర్ల పరిశుద్ధీకరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఉన్న డూప్లికేటు ఓటర్లను తొలగించేందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అచ్చుతప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని సరిచేయాలన్నారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ల జాబితాను, స్థానిక ఓటర్ల జాబితాను సరిపోల్చుకోవాలని సూచించారు. 2016 ఓటర్ల జాబితా సవరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వచ్చి వెళ్లేందుకు దారి, తదితర సదుపాయాలన్నీ ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా ట్యాబ్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. బీఎల్‌ఓ, ట్యాబ్ ఆపరేటర్ ప్రతి పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉన్న సదుపాయాలను పరిశీలించి ట్యాబ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రతి 1400 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉందని, 2019 ఎన్నికల నాటికి వెయ్యి నుంచి 1100 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల మ్యాప్‌లను తయారు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని వివరించారు. ఓటర్ల జాబితా పరిశుద్ధీకరణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, డీఆర్వో గంగాధర్‌గౌడు, 14 నియోజకవర్గాల ఈఆర్వోలు, ఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.