
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు ఇంకా ఐదు రోజుల సమయం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. ఇప్పటివరకూ 17 లక్షల పైచిలుకు కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు.ఓటర్ల జాబితాలో 4 లక్షల 90 వేల వరకు డబల్ వోటింగ్ ఉన్నట్టు తేలిందన్నారు. బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియ సాగుతోందన్నారు. 23 జిల్లాల్లో ఈవీఎంలు వచ్చాయని, మరో మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో పూర్తిగా వస్తాయన్నారు. రాష్ట్రంలో 170 మంది ఈవీఎం ఇంజనీర్లు అందుబాటులో ఉన్నారని, 120 మందిని ఢిల్లీకి మాస్టర్ ట్రైనింగ్ కోసం పంపిస్తామని చెప్పారు.
కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియని మరణించిన వారి పేర్లను తొలగించేందుకు, చిరునామా మార్పులకు మాత్రమే తుదిగడువు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో ఉన్న లిస్టునే అందరికీ ఇస్తామన్నారు. ఎన్నికల గుర్తు విషయంలో మాకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని, అది మోడల్ కోడ్ వచ్చాక చూస్తామని చెప్పారు. శాంతి భద్రతలను పకడ్బందీగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.ఢిల్లీ నుంచి ఈసీ బృందాలు ఎప్పటికప్పుడు వస్తాయని, అది సాధారణ ప్రక్రియేనని పేర్కొన్నారు.
ఈవీఎంల పరిశీలన క్షుణ్ణంగా జరుగుతోందన్నారు. ఫస్ట్ లెవల్ చెక్ జరుగుతోందని, రోజుకు 540 ఈవీఎంలను మాత్రమే చెక్ చేయగలరన్నారు. ఏ గుర్తుకు నొక్కినా ఒక్కరికే వెళ్తుందన్న సందేహాల నివృత్తి కోసం మరింత ప్రచారం చేస్తామన్నారు. తొలుత ఈవీఎంలను చెక్ చేసిన అనంతరం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని, ప్రతీ అసెంబ్లీ సెగ్మంట్‌లో 10 యూనిట్లతో ప్రజల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రజత్ కుమార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment