సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నకిలీ ఓటర్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నాయన్న వాదనకు బలం చేకూరుస్తూ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని భరత్‌నగర్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలు బయటపడ్డాయి. ఎవరులేని ఓ ఇంట్లో 68, మరో ఇంట్లో 74 ఓట్లు ఉండటం కలకలం రేపింది. ఈ ఇళ్లు పాడుబడిపోయాయని, వీటిలో ఎవరూ నివసించడం లేదని స్థానికులు తెలిపారు. ఇంతకుముందు ఇక్కడున్న వారు మరోచోట ఓటు నమోదు చేసుకున్నారా, లేదా అనేది వెల్లడి కాలేదు. ఒకవేళ మరో చోట ఓటరుగా నమోదై ఉంటే ఈ ఓట్లను ఎందుకు తొలగించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు తమ ఓట్లు తీసేశారని పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులతో వచ్చినప్పటికీ ఓటు వేసే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో ఓటు వేశారని, ఇప్పుడు తమ ఓట్లను ఎందుకు తొలగించారో తెలియదని వాపోతున్నారు. తమ ఓట్లను తొలగించారని తెలిసి మళ్లీ ఓటు నమోదు కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని మరికొంత మంది చెప్పారు. మనుషులు లేని ఇంట్లో ఓట్లు ఉన్నాయని, తాము ఇక్కడ ఉంటున్నప్పటికీ ఓట్లు తొలగించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment