తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరులోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూపొందించిన తుది ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తిరువళ్లూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు చెల్లముత్తు అధికారులను హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను, తుది జాబితాను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమావేం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీలో రాజకీయ నేతల జోక్యం లేకుండా సక్రమంగా రూపొందించాలని ఆదేశించారు. ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోనైనా తప్పులు జరిగినట్టు ఫిర్యాదులు వస్తే ఆయా ప్రాంతాలకు ఆర్‌డీవో నేరుగా వెళ్లి సంబంధిత ఫిర్యాదుపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో పాటు ఎన్నికలు కేంద్రాల ఎంపిక, బూత్‌లెవల్ అధికారుల నియామకం తదితర వాటిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో అభిరామి, తహశీల్దార్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.