కళ్లకు గంతలు కట్టుకుని..
సమ్మెలో కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్‌ఎంలు
సంఘీభావం తెలిపిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు
వికారాబాద్ రూరల్: ఎనిమిదేళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్‌ఎంలను వెంటనే క్రమబద్ధీకరించి వారి సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్‌ఎంలు చేస్తున్న సమ్మె గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. సబ్ కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న వారికి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి జే.రత్నారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్ నర్సింలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్‌ఎంలను వెంటనే క్రమబద్ధీకరించాలని, వారి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ మాట్లాడుతూ.. వైఎస్ ఇంకా కొన్ని రోజులు జీవించి ఉంటే కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుని ఉండేవారన్నారు. డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి జె.రత్నారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మహిపాల్, కేవీపీఎస్ కార్యదర్శి మల్లేశ్, నాయకులు సీహెచ్ భాస్కర్, ఖాలీద్, తొర్మామిడి వీరేశం, ఏఎన్‌ఎంలు స్రవంతి, శోభారాణి, సుజాత, నర్సమ్మ, పాపమ్మ, అంజలి, స్నేహలత, సుహాసిని, నాగమణి తదితరులు పాల్గొన్నారు.