వ్యాధులపై సమరం
► జిల్లాకు చేరిన మలేరియా ర్యాపిడ్ కార్డులు
► ఉమ్మడి జిల్లాకు 75వేలు
► క్లోరిన్ గుళికలు 7లక్షలు
► దోమలు, లార్వాల నివారణకు స్ప్రే, లిక్విడ్స్
► కాంట్రాక్టర్ల ద్వారా జిల్లాల్లో స్ప్రే పనులు
సాక్షి, ఆదిలాబాద్: సీజనల్ వ్యాధుల ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా సీజనల్ వ్యాధుల ప్రభావం కారణంగా అధికసంఖ్యలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగించేది. గత రెండేళ్లుగా మరణాల ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ వ్యాధుల ప్రభావం మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి కలుషితం నివారణకు చర్యలు తీసుకుంటోంది. వ్యాధులు ప్రబలినప్పుడు తక్షణం వివిధ పరీక్షల ద్వారా గుర్తించేందుకు అనువుగా టెస్ట్‌కార్డులను ఏటా సరఫరా చేస్తోంది. ఈయేడు కూడా ఉమ్మడి జిల్లాకు మలేరియా ర్యాపిడ్ కార్డ్ టెస్టు కిట్లు మంజూరు చేసింది.
75వేల ర్యాపిడ్ కార్డ్ టెస్టు కిట్లు..
తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌళిక సదుపాయాల అభివద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) నుంచి ఉమ్మడి జిల్లాకు 75వేల మలేరియా ర్యాపిడ్ కార్డ్ టెస్టులు మంజూరయ్యాయి. వీటిని నాలుగు జిల్లాలకు త్వరలో పంపించనున్నారు. మలేరియా వ్యాధిని తక్షణం గుర్తించేందుకు ఈ ర్యాపిడ్ కార్డు టెస్టుల ద్వారా నిర్ధారణ చేయవచ్చు. దీంతోపాటు ఇదివరకు మలేరియా పాజిటివ్ కేసులు రెండును మించి వచ్చిన చోటా పైరిత్రమ్ స్ప్రేను నాలుగు జిల్లాలకు కలిపి 200 లీటర్లు మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా దోమల ఉధృతి ఉన్న చోటా, ఇళ్ల లోపల పైరిత్రమ్‌ను స్ప్రే చేయడం జరుగుతుంది.
నిల్వ ఉన్న నీళ్ల దగ్గర దోమల లార్వాలు వృద్ధి చెందే అవకాశం ఉండగా, అక్కడ టెమిఫోస్ లిక్విడ్‌ను చల్లడం ద్వారా లార్వాలను నిరోధించే అవకాశం ఉంటుంది. జిల్లాకు 550 లీటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నాలుగు జిల్లాలకు దీనిని సరఫరా చేయనున్నారు. ఇండోర్ రెసిడ్యూయల్ స్ప్రేగా పేర్కొనే దీన్ని జిల్లాల్లో డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. వీటితోపాటు మైక్రోస్లైడ్స్, బ్లడ్ ల్యాన్సర్లు, స్లైడ్ బాక్సులను సైతం మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఇవి చేరుకున్నాయి. వీటిని నాలుగు జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
ఏడు లక్షల క్లోరిన్ గుళికలు..
ప్రధానంగా మంచినీటి ట్యాంకులు, బావుల్లో ఆర్‌డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో క్లోరినేషన్ చేయడం ద్వారా నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నివారించవచ్చు. ట్యాంకుల్లో ప్రతి 15 రోజులకోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. బావుల్లో వారానికి ఒకసారి క్లోరినేషన్ చేయాలి. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలం తడిహత్నూర్‌లో బావిలో నీరు కలుషితం కావడంతో వందమందికి పైగా అస్వస్థతకు గురైన విషయం విదితమే. నిల్వ ఉన్న నీటిలో క్లోరినేషన్ చేస్తారు. వాగులు, వంకల్లో ప్రస్తుతం కొత్త నీరు చేరుతోంది. పలు గ్రామాల్లో ఆ నీటిని కుండల్లో నింపుకొని గ్రామస్తులు తాగుతున్నారు.
తద్వారా నీరు కలుషితంగా ఉండి డయేరియా వంటి వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు 7లక్షల క్లోరిన్ గుళికలను సరఫరా చేసింది. ఇప్పటికే ఇవి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరుకున్నాయి. నాలుగు జిల్లాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా వాగులు, వంకల నుంచి బిందెల్లో పట్టుకున్న నీటిలో రాత్రిపూట ఒక క్లోరిన్ గుళిక వేసి మరుసటి రోజు కాచివడబోసి తాగిన పక్షంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉండదని వైద్యాధికారులు చెబుతున్నారు.
పెరిత్రమ్ స్ప్రే..
ఉమ్మడి జిల్లాకు 200 లీటర్లు మంజూరు
నాలుగు జిల్లాలకు 50 లీటర్ల చొప్పున పంపిణీ
టెమిఫోస్ లిక్విడ్..
టెమిఫోస్ లిక్విడ్ 550 లీటర్లు
నాలుగు జిల్లాలకు సమానంగా పంపిణీ
మలేరియా టెస్టులు చేసేందుకు మైక్రోస్లైడ్స్..
ఉమ్మడి జిల్లాకు 2లక్షల 90వేలు
రోగి నుంచి రక్తం సేకరించేందుకు బ్లడ్ ల్యాన్సర్స్..
ఉమ్మడి జిల్లాకు 2లక్షల 90వేలు
రక్త సేకరణ తర్వాత నిల్వ కోసం స్లైడ్ బాక్సులు..
ఉమ్మడి జిల్లాకు స్లైడ్ బాక్సులు 400
జిల్లాకు 100 చొప్పున
పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాల్లో స్ప్రే
ఇదివరకు మలేరియా పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాల్లో ఇండోర్ రెసిడ్యూయ్ స్ప్రే చేయిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించాం. ఆదిలాబాద్ జిల్లాలోని 437 గ్రామాల్లో ఈ స్ప్రే చేపడుతున్నాం. ప్రతి గ్రామంలో స్ప్రే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్ప్రే పనులను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఎక్కడైనా లోపాలు ఉన్నపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం.
– రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో