మేల్ మోడల్స్ | male models over come in modeling | Sakshi
Sakshi News home page

మేల్ మోడల్స్

Published Fri, Jul 29 2016 6:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

మేల్ మోడల్స్

మేల్ మోడల్స్

సాక్షి, వీకెండ్: సిటీలో మేల్‌ మోడలింగ్‌ రంగం మరోసారి సగర్వంగా ఒళ్లు విరుచుకుంది. నగరం నుంచి పలువురు ఆజానుబాహులు ఇప్పటికే మోడల్స్‌గా దేశవ్యాప్తంగా రాణిస్తుంటే.. తాజాగా నగరవాసి రోహిత్‌ ఖండేల్వాల్‌ మిస్టర్‌ వరల్డ్‌ కిరీటం సొంతం చేసుకోవడం ఆ కాంతులకు మరింత వన్నెలు తెచ్చింది.
                                                         – ఎస్‌.సత్యబాబు

మోడలింగ్‌ రంగం స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు అందిస్తుందనేది తెలిసిందే. అయితే ఇది అమ్మాయిల విషయంలో కాస్త ఎక్కువ అని చెప్పాలి. సహజంగానే ఈ రంగం వైపు యువతులు కాస్త సందేహంగా చూస్తుంటారు కాబట్టి.. పురుషుల కన్నా అమ్మాయిల రాకే తక్కువ. అందుకే వారికే డిమాండ్‌ ఎక్కువ. పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పటికీ.. నగరం నుంచి మేల్‌ మోడల్స్‌గా రాణిస్తున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

ఎందరో మోడల్స్‌.. కొందరే హీరోస్‌

రోహిత్‌ విశ్వవిజేతగా నిలిచిన నేపథ్యంలో సిటీ మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే గతంలోనూ పురుషుల అందాల పోటీలలో నగరం చెప్పుకోదగ్గ స్థాయిలో పార్టీసిపెంట్స్‌ను పంపించి కొద్దో గొప్పో టైటిల్స్‌ను కూడా అందుకుంది. పురుషుల గ్లామర్‌ కాంటెస్ట్‌లు నిర్వహించడంలో ముందుండే గ్రాసిమ్, గ్లాడ్‌రాగ్స్‌... తదితర దుస్తుల బ్రాండ్స్‌ అందించే టైటిల్స్‌ కోసం నగరం నుంచి పెద్ద సంఖ్యలోనే పోటీదారులు హాజరయ్యేవారు. వీరిలో పలువురు టైటిల్స్‌ గెలుచుకున్నారు కూడా. సిటీకి చెందిన రెగీ వర్గీస్‌ తొలి మిస్టర్‌ ఇండియాగా కిరీటం దక్కించుకోగా...

అంతకు మించిన స్థాయి టైటిల్‌ను రోహిత్‌ సాధించాడు. ఇక సిటీకి చెందిన శ్రీధర్‌ మిస్టర్‌ ఫిజిక్, బెస్ట్‌ డ్రెస్డ్‌ మేల్‌ టైటిల్స్‌ గెలుచుకున్నాడు. అనంతరం భారీ కార్పొరేట్‌ కంపెనీలకు మోడలింగ్‌ ఛాన్స్‌ దక్కించుకొని సినీ నటుడు కూడా అయ్యాడు. ఇప్పటికి దాదాపు 15 సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా నటించాడు. అదే కోవలో కరణ్‌ సింగ్, ఫర్హాద్, వాసు తదితరులు గ్లాడ్‌రాగ్స్, గ్రాసిమ్‌ నిర్వహించిన పోటీలలో తమ సత్తా చాటారు. వీరు కూడా తమదైన శైలిలో సినీ, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరెందరో యువకులు మోడలింగ్‌ వైపు ఆకర్షితులు అయ్యారు.

యువతుల జోరు.. కుదేలైన కుర్రాళ్లు
అయితే కాలక్రమంలో మోడలింగ్‌ పూర్తిగా యువతుల ఆధిపత్య రంగంగా మారిపోయింది. పురుషులకు కూడా సమాన అవకాశాలు ఉన్నప్పటికీ మేల్‌ మోడల్స్‌ ఎక్కువ కావడంతో మంద ఎక్కువై మజ్జిగ పలచనైన చందంగా మారింది. అమ్మాయిలతో పోలిస్తే వీరికి రెమ్యునరేషన్‌ నుంచి అన్నీ తక్కువే. జాతీయ స్థాయిలో టైటిల్స్‌ గెలుచుకున్నవారు కూడా సినిమాల్లో అరకొర అవకాశాలతో కాలం గడిపేస్తున్నారు.

మరోవైపు వీధివీధినా యువతుల అందాల పోటీల సందడి ఎక్కువైపోయి.. అదే సమయంలో మేల్‌ కాంటెస్ట్‌లు తగ్గిపోతున్నాయి. జరుగుతున్న పోటీల్లోనూ మన సిటీకి పెద్దగా విజయాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా భారత్‌కు దక్కని మిస్టర్‌ వరల్డ్‌ కిరీటం రోహిత్‌ అందించడం, అతను కూడా మన నగరానికి చెందిన యువకుడు కావడంతో... మళ్లీ మేల్‌ మోడలింగ్‌కు మంచి రోజులు వస్తాయని నగర మోడల్స్‌ నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజం కావాలని కోరుకుందా

ఫ్యూచర్‌.. సూపర్‌
మేల్‌ మోడల్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. బ్యూటీ కాంటెస్ట్‌లలో టైటిల్స్‌ విజయాలతో సంబంధం లేకుండా మంచి ఫిజిక్, ఫేస్‌ కట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ మోడలింగ్‌లో అవకాశాలు లభిస్తున్నాయి. మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఈ రంగంలో ఇంకా తప్పటడుగుల దశలోనే ఉంది. కాబట్టి ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్‌ ఉందనేది నిస్సందేహం.
                                         – అన్వర్, కొరియోగ్రాఫర్, లఖోటియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మోడలింగ్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement