సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, ఆ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేశ్ గౌడ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు వినోద్‌రెడ్డితో కలసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా అభివృద్ధి విషయంలో చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ నచ్చి జిల్లా నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.
మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు దిండి ప్రాజెక్టుతో అభివృద్ధి చెందనున్నాయని, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఊహించని విధంగా పవర్‌ప్లాంట్‌ను దామరచర్లలో సీఎం ప్రారంభించారని అన్నారు. ఐదారుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినా జానారెడ్డి జిల్లా, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారి గురించి మాట్లాడుతున్న జానారెడ్డి, సుఖేందర్‌రెడ్డిలే జిల్లాలో ఫిరాయింపులకు బీజం వేసిందని అన్నారు. కోమటిరెడ్డి సోదరులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు చాలా ప్రయత్నించినా, కాంగ్రెస్‌ను నాశనం చేసిన వీరు పార్టీలోకి వస్తే నాశనమవుతుందని స్థానిక నేతలు అడ్డుకున్నారని పేర్కొన్నారు.
జిల్లా రాజకీయాలను కలుషితం చేసిన జానారెడ్డి, సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు ఓటమి భయంతోనే విమర్శలకు దిగుతున్నారన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లేశ్‌గౌడ్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో సేవ చేసినా, ఫలితం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు నాశనం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన మల్లేశ్ గౌడ్
Published Sat, Dec 26 2015 5:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement