
ఇంట్లో నుంచి బయటకు లాగీ నరికి చంపారు
దుబ్బాక : మూఢ నమ్మకాల ముసుగులో మనిషిని మనిషి చంపుకునే సంస్కృతి మరింత పెరిగిపోతోంది. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని వేటాడి మరీ హతమార్చిన సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిన్ననిజాంపేటలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన సంఘం బాలయ్య (60)కు మంత్రాలు వస్తాయని అదే గ్రామానికి చెందిన సంఘం రాములు అనుమానించాడు.
రామాయంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన పిట్ల రమేశ్‌కు తన కుమార్తె లావణ్యను ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే లావణ్య ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఇందుకు బాలయ్య మంత్రాలే కారణమని రాములు కక్ష పెంచుకున్నాడు. దీంతో అతడు మరికొందరిని వెంటబెట్టుకుని శుక్రవారం బాలయ్య ఇంటిపై దాడి చేశాడు.
ఇంట్లోకి చొరబడి బాలయ్య కుటుంబ సభ్యులందరినీ బయటకు వెళ్లగొట్టాడు. ప్రమాదాన్ని పసిగట్టిన బాలయ్య ఇంట్లోకి పరుగెత్తుకెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. వారంతా తలుపులను పగులగొట్టి బాలయ్యను బయటకు లాక్కొచ్చి గొడ్డలితో నరికి చంపారు. దాంతో బాలయ్య రక్తపు మడుగులో కుప్పకూలి మరణించారు.
అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్నాకే వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.