కొడుకు చేసిన పనికి తండ్రి ఆత్మహత్య..
మానవపాడు (మహబూబ్‌నగర్) : కుమారుడి ప్రేమ వ్యవహారానికి తండ్రి బలయ్యాడు. కుమారుడు ఓ యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్లిపోవడంతో వచ్చిన బెదిరింపులకు మనస్తాపం చెందిన అబ్బాయి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం మద్దూరు గ్రామంలో ఆదివారం జరిగింది. మోనప్ప గ్రామంలోని గ్రామీణ తాగునీటి సరఫరా పథకంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నాడు. ఇతడి మూడవ కుమారుడు ప్రవీణ్ కరీంనగర్‌లో బీటెక్ చదువుతున్నాడు. హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలో ఉన్న స్నేహితుల దగ్గరకు తరచూ వెళుతుండేవాడు.
అక్కడే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తాజాగా ప్రవీణ్ ఆ యువతిని తీసుకుని ఎటో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రులు ప్రవీణ్ తండ్రి మోనప్పకు ఫోన్ చేసి బెదిరించారు. మరోవైపు విచారణ పేరుతో పోలీసుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్‌తో మనస్తాపం చెందిన మోనప్ప ఆదివారం తాను పనిచేస్తున్న వాటర్ స్కీమ్ వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోనప్ప మొదటి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.