
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా
కుందుర్పి : కుందుర్పి–మాయదార్లపల్లి మార్గంలో ఓ ట్రాక్టర్ శనివారం అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో శెట్టూరు మండల అనుంపల్లికి చెందిన సోమనాథ్(32) మృతి చెందగా, అదే మండలం రంగయ్యపాళ్యం చెందిన లక్ష్మణమూర్తి, తిప్పేస్వామి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమనాథ్ తన ఇంటి వద్ద పశువుల పాక కోసం అవసరమైన కట్టెల కోసం అనుంపల్లి, రంగయ్యపాళెం చెందిన ఆరుగురితో కలసి కర్ణాటకలోని మరదాసనపల్లెకు వెళ్లాడు.
అక్కడ కట్టెలు కొనుగోలు చేసి స్వగ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో కుందుర్పి సమీపంలోని కుంట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో సోమనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఇంజిన్ కింద ఇరుక్కుపోయిన లక్ష్మణమూర్తిని చుట్టుపక్కల వారు గమనించి అతనితో పాటు తిప్పేస్వామిని రక్షించారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.