పోలీసుస్టేషన్ వద్ద బాధితురాలు, పెళ్లి నాటి ఫొటో
♦ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
♦ గతంలోనూ పలు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న మొదటి భార్య
సాక్షి పలమనేరు : తాను రియల్టర్‌నని, తన భార్య చనిపోయిందని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని నెలరోజుల తర్వాత భర్త పారిపోయాడు. బాధితురాలు న్యాయం కోసం ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన మనోహర్ విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరంలో కొన్నాళ్లుగా ఉంటున్నాడు. తాను రియల్టర్‌నని అక్కడ చెప్పుకునేవాడు. ఈ క్రమంలో తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, భార్య చనిపోయిందని అదే గ్రామానికి చెందిన ఓ మ్యారేజ్ బ్రోకర్‌కు చెప్పాడు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. బ్రోకర్ ద్వారా అదే గ్రామానికి చెందిన తాతాబాయి కుమార్తె నాగమణిని గత నెల 16న సింహాచలం ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. అత్తగారింట్లోనే కాపురం పెట్టాడు. అదే ప్రాంతంలో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు.
బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ భార్యను వదలి అక్కడి నుంచి ఉడాయించాడు. అతను మరిచిపోయిన పర్సును పరిశీలించగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వాడిగా గుర్తించారు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. మనోహర్ మొదటి భార్యను పోలీసులు విచారించారు. మనోహర్ గతంలోనూ కదిరి, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిపింది. స్థానికంగా ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు తీసిస్తానంటూ పలువురికి టోపీ పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు నాగమణి లబోదిబోమంటోంది. న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ వద్దే వేచి చూస్తోంది. మనోహర్ అందుబాటులో లేడని అతని మొదటి భార్య చెప్పడం గమనార్హం.