వ్యాపార కక్షతో యువకుడి హత్య
వ్యాపార కక్షతో యువకుడి హత్య
Published Thu, Sep 8 2016 12:57 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
సమీప వ్యాపారులే నిందితులు
హతుడు ‘పశ్చిమ’ జిల్లా కోపల్లె వాసి
పి.గన్నవరం : కిలో చికెన్ ఐదు నుంచి పది రూపాయలకు తక్కువకు అమ్ముతున్నాడన్నSనెపంతో ఓ యువకుడిని తోటి వ్యాపారులైన బంధువులే హతమార్చి, మృతదేహాన్ని పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడేసిన సంఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చిం ది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన సాల సురేష్ (20)ను సోమవారం అర్ధరాత్రి మాయమాటలతో పి.గన్నవరం మండలం బెల్లంపూడి శివారు తాడాలవారిపాలెం గ్రామానికి తీసుకువచ్చి హతమార్చినట్టు పోలీసు ల విచారణలో తెలిసింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో కాళ్ల పోలీసులు ఇక్కడి పంట కాలువలో మృతదేహాన్ని వెలికితీశారు. కాళ్ల ఎస్సై ఇ.ప్రసాదరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోపల్లె గ్రామానికి చెందిన సాల సురేష్, అతడి బంధువులైన మరో ఇద్దరు యువకులు అదే గ్రామంలో పక్కపక్కనే చికెన్ వ్యాపారాలు చేస్తున్నారు. చికెన్‌ను తక్కువ రేటుకు విక్రయిస్తుండడంతో సురేష్Sవ్యాపారం బాగా పెరిగింది. ఆర్డర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఇద్దరు వ్యాపారులు అతడిపై కక్షగట్టి, హతమార్చాలని పథకం రచించారు. అమలాపురంలో కోళ్లను హోల్‌సేల్‌గా తక్కువ ధరకు ఇస్తున్నారని, అక్కడి నుంచి తెచ్చుకుని వ్యాపారం చేద్దామని సురేష్‌కు మాయమాటలు చెప్పారు. ముగ్గురూ కలిసి సోమవారం రాత్రి మోటార్ బైక్‌పై అమలాపురం బయలు దేరారు. మధ్యలో సురేష్ కూర్చున్నాడు. బైక్‌ను పి.గన్నవరం నుంచి రావులపాలెం వైపు పోనిచ్చారు. తాడాలవారిపాలెం వచ్చేసరికి అర్ధరాత్రి రెండు గంటలైంది. వెనుక ఉన్న వ్యక్తి సురేష్ తలపై సుత్తితో బలంగా కొట్టాడు. బైక్‌ను ఆపి సుత్తితో సురేష్‌ను విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. మృతదేహానికి రాళ్లు కట్టి, ప్రధాన పంట కాలువలో పడేసి వెళ్లిపోయారు. సురేష్ కనపడకపోవడంతో అతడి సోదరుడు కుమార్ మంగళవారం కాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మిస్సింగ్ కేసు నమోదైంది. సమీప వ్యాపారులైన నిందితులపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో యర్రంశెట్టివారిపాలెం వద్ద కాలువలో సురేష్ మృతదేహాన్ని వెలికితీశారు. అక్కడే సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement