భగ్గుమన్న పాత కక్షలు!
భగ్గుమన్న పాత కక్షలు!
Published Mon, May 29 2017 11:35 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
పట్టపగలు యువకుడి దారుణ హత్య
ఇంద్రపాలెం (కాకినాడ రూరల్) : పాత తగాదాల నేపథ్యంలో పట్టపగలు ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు మాంసం కత్తి, క్రికెట్‌కు వినియోగించే వికెట్లు, చాకుతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇంద్రపాలెంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇంద్రపాలెం అర్జున్‌నగర్‌కు చెందిన దొమ్మ వీరేంద్ర (22) తండ్రి చిన్నతో కలసి స్థానిక మార్కెట్‌లో చికెన్, మటన్ వ్యాపారం చేస్తూంటాడు. ఉదయం వ్యాపారం పూర్తవ్వగానే అతడు బిక్కవోలు కాలువ గట్టు వద్ద స్నేహితులతో మద్యం సేవిస్తూంటాడు. ఎప్పటిలాగానే మాంసం వ్యాపారం పూర్తయిన తర్వాత బైక్‌పై కాలువ గట్టుకు వెళ్లాడు. ఇంతలో కొంతమంది క్రికెట్‌కు ఉపయోగించే వికెట్లు, మాంసం కత్తి, చాకు, కర్రలతో వచ్చి వీరేంద్రపై దాడి చేశారు. విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. తలపై బలంగా మోది, మాంసం కత్తితో పొట్ట, వీపుపై పొడవడంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
స్థానికులు వచ్చేసరికి నిందితుల పరార్
సంఘటనా ప్రదేశం వద్ద అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికు వచ్చేలోగా నిందితులు కారులో పరారయ్యారు. కొన ఊపిరితో సంఘటనా ప్రదేశంలో పడి ఉన్న వీరేంద్రను స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న అతడు కొద్దిసేపులోనే మృతి చెందాడు. హత్యలో సుమారు పది మంది నిందితులు పాల్గొన్నట్టు పోలీసులకు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు చేరుకుని హత్యకు దారి తీసిన పరిస్థితులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు తెలిపారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ వి.పవన్‌కిషోర్, సర్పవరం, టూటౌన్ సీఐలు చైతన్యకృష్ణ, ఉమర్ ఉన్నారు.
రెండేళ్ల క్రితం హత్యాయత్నం..
మృతుడిపై రెండేళ్ల కిందట కొందరు హత్యా యత్నానికి పాల్పడ్డారు. కాకినాడ గాంధీనగర్‌లో ఓ వైన్‌షాపు వద్ద చోటుచేసుకున్న తగాదాలో సాయిధన్‌కి చెందిన ఎల్విన్‌పేటకు చెందిన వ్యక్తులను వీరేంద్ర కొట్టాడు. దీంతో అతడిని హత్య చేసేందుకు కాకినాడ టాక్సీ స్టాండ్ వద్ద మాటు వేసిన వారిని టూటౌన్ అప్పటి సీఐ చైతన్యకృష్ణ.. ప్రధాన నిందితుడు సాయిధన్‌తో పాటు అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు సాయిధన్‌పై 307 హత్యాయత్నం కేసు పెట్టి రౌటీషీట్ తెరచినట్టు సీఐ తెలిపారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని హత్యకు పాల్పడ్డారా? లేక వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఏడాది కిందటే దుబాయ్ నుంచి ఇంద్రపాలెం తిరిగి వచ్చాడు. అతడికి ఆరు నెలల బాబు, భార్య ఉన్నారు. భోజనం చేసి బయటకు వెళ్లమంటే ఇప్పుడే వచ్చేస్తానంటూ బయటకెళ్లిన కుమారుడిని ఇలా చూడాల్సి వస్తూందని అనుకోలేదని తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులను కంటతడిని పెట్టించింది.
Advertisement
Advertisement