అట్టహాసంగా క్రీడాపోటీలు
Published Tue, Aug 30 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
అయిజ : ఉత్తనూరు గ్రామంలో క్రీడాదినోత్సవం సందర్భంగా సోమవారం ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో టీఆర్‌ఎస్ నాయకులు ఉత్తనూరు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు విద్యార్థులు, పీఈటీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చైర్‌పర్సన్ రాజేశ్వరి, సింగిల్‌విండో ప్రెసిడెంట్ రామముడు, తహసీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ నాగేంద్ర, ఎంఈఓ గిరిధర్, వైస్ ఎంపీపీ నీలకంఠరెడ్డి, వ్యవసాయ అధికారి శంకర్‌లాల్ హాజరయ్యారు. ముందుగా జాతీయజెండా, క్రీడల జెండాలను ఆవిష్కరించారు. విద్యార్థులు గౌరవ వందనం చేశారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులు నృత్యాలతో అలరించారు. పిరమిడ్ ఆకారంలో కరాటే విన్యాసాలను ప్రదర్శించారు.
ప్రతిభను వెలికితీసేందుకే: తిరుమల్‌రెడ్డి
అనంతరం టీఆర్‌ఎస్ నాయకులు తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల బాల బాలికలతో మూడురోజులపాటు అన్ని రకాల క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం క్రీడలను ప్రత్సహించాలని, క్రీడాకారులకు చేయూతనందించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి సానెపట్టాలని కోరారు. అనంతరం కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులతో క్రీడాపోటీలను ప్రారంభించారు. వివిధ క్రీడా పోటీల్లో అన్ని పాఠశాలల విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. క్రీడాపోటీలను చూసేందుకు ప్రజలు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఎన్‌టీఆర్ మినీస్టేడియం కిక్కిరిసిపోయింది.
Advertisement