రసాభాసగా ముగిసిన మండల సభ
రసాభాసగా ముగిసిన మండల సభ
Published Sun, Aug 7 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
మఠంపల్లి : స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఎంపీపీ అంజమ్మబుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం కేవలం 10 నిమిషాల్లోనే రసాభాసాగా ముగిసింది. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీపీ మాట్లాడుతుండగా ఇటీవల మంజూరైన మాడా రుణాల వివరాలు తెలపాలని వైఎస్ ఎంపీపీ సయ్యద్‌బీబీతో పాటు మరో ముగ్గురు ఎంపీటీసీలు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ, ఈఓఆర్డీ జానకీరాములుతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు వాగ్వాదానికి దిగారు. దీనికి తోడు బయట ఉన్న పలువురు ఎంపీటీసీల భర్తలు, బయటి వ్యక్తులు సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు, వారి అనుచరులు కుర్చీలు విరగ్గొడుతూ వీరంగం సృష్టించారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ సమావేశం ముగిసినట్లుగా ప్రకటించి తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనుల నిమిత్తం పూర్తిస్థాయిలో అధికారులు హాజరయ్యే పరిస్థితి లేనప్పటికీ సమావేశం నిర్వహించామని అన్నారు. సమావేశాన్ని ప్రారంభించకుండానే నలుగురు ఎంపీటీసీలు బయటి వ్యక్తులతో కలిసి గొవడ సృష్టించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ సయ్యద్‌బీబీ, ఎంపీటీసీలు సోవమ్మ, దస్రు, రంగమ్మ, సామ్యేలు, జయమ్మ, నాగు, బాల, ఈఓఆర్డీ జానకీరాములు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డీటీ బాలాజీనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సమావేశ మందిరంలోకి వచ్చి గొడవకు దిగిన వ్యక్తులపై ఎంపీపీ అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యులంతా హాజరైనప్పటికీ సభను వాయిదా వేయడం సరికాదంటూ జెడ్పీటీసీ నీలా మంజీనాయక్, జెడ్పీకోఆప్షన్ సభ్యుడు రాజారెడ్డిలు అన్నారు. అనంతరం మాడా రుణాలపై విచారణ జరిపించాలని కోరుతూ ఈఓఆర్డీకి వినతిపత్రం అందజేశారు.
ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయింపు
సమావేశం ముగించి ఎంపీపీ ఛాంబర్‌లోకి వెళ్లగానే సమావేశంలో ఆందోళన చేసిన నలుగురు ఎంపీటీసీలు ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సయ్యద్‌బీబీ మాట్లాడుతూ మండల పరిషత్‌లో గౌరవ సభ్యులకు తగిన ప్రాతినిధ్యం లేదని, ఇటీవల మంజూరైన మాడా రుణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమేష్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించారు.
Advertisement
Advertisement