matampalli
-
ఎస్టీ హాస్టల్లో అగ్నిప్రమాదం
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని ఎస్టీ హాస్టల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యార్థుల పరుపులు, పుస్తకాలు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిపుడు పిల్లలెవరూ హాస్టల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేదు. ఇన్వర్టర్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ కూడా అందుబాటులో లేరు..స్థానికులు గమనించి వెంటనే మంటలు ఆర్పడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. -
రైతులకు నష్టపరిహారం అందజేస్తాం
మఠంపల్లి : మండలంలోని మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు నిర్మించిన రైల్వేలైన్ నిర్మాణంలో గల పెండింగ్ భూములను గురువారం జిల్లా జేసీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు రైల్వేలైన్‌లో భూములు కోల్పోయిన రైతులకు పూర్తినష్టపరిహారం అందజేశామన్నారు. కాగా 7 ఎకరాల ఏడున్నర కుంటల పెండింగ్ భూములకు నష్ట పరిహారం చెల్లించాల్సిన భూములను పరిశీలించామన్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం 7 ఎకరాల ఏడున్నర గుంటల రైతులకు కూడా నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, ఆర్ఐ శైలజ, వీఆర్ఓ యాదయ్య, సిమెంట్ పరిశ్రమల అధికారులు, స్థానిక రైతులు ఉన్నారు. -
తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి
మఠంపల్లి : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర రైతాంగం సమస్యలను చర్చించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీని సమావేశ పర్చాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి కోరారు. ఆదివారం మఠంపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె స్థానికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ చివరి వారంలో అసెంబ్లీని సమావేశపరుస్తానని నిండు సభలో ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల చర్చకు ఉపక్రమించకపోవడం సరికాదన్నారు. భారతసైన్యంలో వాయుసేనలో పనిచేసిన తన భర్త పీసీసీ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి యుద్ధ విమానాలు నడిపారన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధమంటూ వస్తే వయసుతో సంబ«ంధం లేకుండా యుద్ధంలో పాల్గొంటానని ప్రకటించడం తనకెంతో గర్వంగా ఉందని.. ఈ ప్రకటనను తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. సమావేశంలో మంజీనాయక్, రాజారెడ్డి, స్రవంతికిషోర్‌రెడ్డి, గాలిచిన్నపరెడ్డి, బాలగురవయ్య, రవినాయక్, నవీన్‌నాయక్, బాబునాయక్, శ్రీనివాసరెడ్డి, కిషన్‌నాయక్, వంటిపులిశ్రీను, కృష్ణయ్య ఉన్నారు. -
ఎత్తిపోతల పథకాలపై దృష్టిసారించాలి
మఠంపల్లి : పులిచింతల బ్యాక్ వాటర్ ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మట్టపల్లి వద్ద కృష్ణానది వరద ముంపును, బాధితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన కృష్ణానదిపై బల్లకట్టులో ఆవలిభాగం ఒడ్డు వరకు వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణపట్టె ప్రాంతంలో రెండు రోజులు పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుంటానన్నారు. ముఖ్యంగా పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా వందల కోట్ల రూపాయలతో నిర్మించిన వెల్లటూరు, బుగ్గమాదారం, మట్టపల్లి, పెదవీడు, అమరవరం ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. మట్టపల్లిలో పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరారు. మట్టపల్లి దేవస్థానం, గ్రామం అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఆయన వెంట భూక్యామంజీనాయక్, శ్రీనివాస్‌గౌడ్, రాజారెడ్డి, ఎండి.నిజాముద్దీన్, యరగాని నాగన్న గౌడ్, ఎం.ఎం.యాదవ్, బచ్చలకూరి బాబు, భాస్కర్‌రెడ్డి, యల్లారెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరావు, బుజ్జి భీముడు, పిచ్చిరెడ్డి, రవినాయక్, బాబునాయక్, హనుమ, సక్రు,వెంకటరమణ,రామయ్య,నారాయణస్వామి,శ్రీనివాసరెడ్డి,సైదిరెడ్డి తదితరులున్నారు. -
కృష్ణా ముంపులో మత్స్యకారుల ఇళ్లు
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదీ ముంపులో బాలాజీ ఘాట్‌కు ఆనుకొని ఉన్న సుమారు 8 మత్స్యకారుల ఇళ్లు శుక్రవారం నీట మునిగిపోయాయి. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద సుమారు 30 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో బ్యాక్ వాటర్ మట్టపల్లి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో నది ఒడ్డున ఉన్న మత్స్యకారుల ఇళ్లు ముంపునకుగురయ్యాయి. అయితే వరద ముంపును ముందస్తుగా అంచనా వేసిన తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ ఆకుల రమేష్‌లు మత్స్యకారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని మత్స్యకారులు రామస్వామి, కోదండంలు కోరారు. -
కృష్ణా ముంపులో మత్స్యకారుల ఇళ్లు
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదీ ముంపులో బాలాజీ ఘాట్‌కు ఆనుకొని ఉన్న సుమారు 8 మత్స్యకారుల ఇళ్లు శుక్రవారం నీట మునిగిపోయాయి. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద సుమారు 30 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో బ్యాక్ వాటర్ మట్టపల్లి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో నది ఒడ్డున ఉన్న మత్స్యకారుల ఇళ్లు ముంపునకుగురయ్యాయి. అయితే వరద ముంపును ముందస్తుగా అంచనా వేసిన తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ ఆకుల రమేష్‌లు మత్స్యకారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని మత్స్యకారులు రామస్వామి, కోదండంలు కోరారు. -
మట్టపల్లిలో పెరుగుతున్న కృష్ణానది నీటి మట్టం
మట్టపల్లి (మఠంపల్లి) : జిల్లాలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద గల కృష్ణానది నీటి మట్టం రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. దీంతో దేవస్థానం వద్ద ప్రహ్లాద ఘాట్‌లోకి భక్తులు వెళ్లకుండా మూసివేశారు. అదేవిధంగా మట్టపల్లి రేవు వద్ద మత్స్యకారులు చేపల షికారుకు వెళ్లే పరిస్థితి నిలిచిపోయింది. కృష్ణానదికి కింది భాగంలో ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ వద్ద సుమారు 19 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిల్వ చేసింది. దీంతో బ్యాక్ వాటర్ మట్టపల్లి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇటీవల నిర్మించిన పుష్కర ఘాట్లు ప్రహ్లాద, బాలాజీ, హైలెవల్‌వంతెన కుడి, ఎడమ ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో మట్టపల్లి రేవు భారీ రిజర్వాయర్‌గా తలపిస్తుంది. గణేష్ నిమజ్జనాలకు వచ్చిన భక్తులు కృష్ణానది నీటి మట్టాన్ని ప్రత్యేకంగా తిలకిస్తున్నారు. -
పుష్కర పార్కింగ్ స్థలాల్లో మెుక్కల పెంపకం
మఠంపల్లి : పుష్కరాల కోసం మండలంలోని మట్టపల్లి వద్ద 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో అధికారులు మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం వర్ధాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సైట్ ఇన్చార్జి బి.మురళి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చింతలమ్మగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉన్న అటవీ భూమిలో పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో ఇటీవల 20 వేల గుంతలు తవ్వారు వీటిలో వేప, గానుగ, దిరిసిన, నారవేప, నెమలినార, సీమతంగేడు వంటి 12 వేల మెుక్కలు నాటినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి.మురళి తెలిపారు. -
ఎస్ఐ మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
బక్కమంతులగూడెం (మఠంపల్లి) : మెదక్ జిల్లా కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తూ అధికారుల వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణారెడ్డి మృతిపై ఐపీఎస్ అధికారిచే విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మృతుడి స్వగ్రామమైన మండలంలోని బక్కమంతులగూడెంలో రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నెలరోజులలో రిటైర్డ్ కానున్న ఏఎస్పీని విచారణాధికారిగా నియమించడం సరికాదన్నారు. మెదక్ జిల్లాలో పనిచేసి బదిలీ అయిన సునితా ఐపీఎస్‌ను విచారణాధికారిగా నియమించాలన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇలాంటి దారుణం జరిగితే స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆయన వెంట ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి పారేపల్లి శేఖర్‌రావు, మండల కార్యదర్శులు ములకలపల్లి సీతయ్య, భూక్యా పాండునాయక్, డివిజన్ కమిటీ సభ్యులు జగన్మోహన్రెడ్డి, పల్లె వెంకటరెడ్డి, శేషగిరిరాజు, మాలోతు బాలు, కె.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
బక్కమంతులగూడెంలో అంత్యక్రియలు
మఠంపల్లి: తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందిన మెదక్‌జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుక్కునూరు ఎస్ఐ ఉస్తేల రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో బుధవారం నిర్వహించారు. అంతకుముందు మృతదేహాన్ని సూర్యాపేట డీఎస్పీ సునీతామోహన్, సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రమేష్, జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బెల్లంకొండ రాంచంద్రంగౌడ్, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కొండపాక జెడ్పీటీసీ మంజుల, ఎంపీపీ పద్మానరేందర్, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ సాములశివారెడ్డిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఉస్తేల అంతిరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఉస్తేల సోమిరెడ్డి ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా, రెండవ కుమారుడు ఉస్తేల లచ్చిరెడ్డి తహసీల్దార్‌గా పనిచే స్తూ తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్లసంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. మూడో కుమారుడు మృతుడు ఉస్తేల రామకృష్ణారెడ్డి కుక్కనూరు ఎస్ఐగా పని చేస్తూ భార్య ధనలక్ష్మి, ఇద్దరు కుమారులతో అక్కడే పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. మా తమ్ముడి ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణం తమ తమ్ముడు ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని అతని సోదరులు ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, తహసీల్దార్లసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉస్తేల లచ్చిరెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడి డీఎస్పీ, సీఐల మానసిక ఒత్తిడే కారణమన్నారు. ఇటీవల గజ్వేల్‌కు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో డిపార్ట్మెంట్ సిబ్బందికి పెట్టిన భోజనాల ఖర్చులు రూ.4 లక్షలు చెల్లించాలని మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. మట్టపల్లిలో కృష్ణాపుష్కరాలకు వచ్చేందుకు అనుమతి కూడా ఇవ్వకపోవడంతో కేవలం భార్య పిల్లలనే పంపించాడన్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలని మెదక్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని కోరామన్నారు. ఏఎస్పీతో పూర్తిస్థాయి విచారణ చేస్తామని , న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. -
రూ.825 కోట్లతో సకల సౌకర్యాలు
హుజూర్నగర్/మఠంపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.825 కోట్లతో పుష్కరఘాట్లతో పాటు భక్తులకు సకల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన వారు అనంతరం మట్టపల్లికి చేరుకున్నారు. స్థానిక ప్రహ్లాద ఘాట్‌లో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కృష్ణానదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘాట్‌లో పుష్కర భక్తులతో మాట్లాడారు. వసతుల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కాగా మట్టపల్లి వద్ద కృష్ణానదిపై బల్లకట్టు నిలిపివేసినందున భక్తుల రాక తగ్గిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంత్రుల దృష్టికి తీసుకురాగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. పానగల్ ఆలయాలను అభివృద్ధి చేస్తాం నల్లగొండ టూటౌన్ : పానగల్లో ఉన్న చారిత్రక ఆలయాలను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖామంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డితో కలిసి మంగళవారం పానగల్ ఘాట్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఛాయాసోమేశ్వర ఆలయం ఎంతో విశిష్టత ఉందన్నారు. నాగార్జునసాగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో పుష్కరఘాట్ల పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగశ్రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హెలికాప్టర్లో జిల్లాలోని పుష్కరఘాట్లను ఏరియల్ సర్వే చేస్తూ నాగార్జునసాగర్‌కు వచ్చారు. బుద్ధ వనంలో హెలికాప్టర్ దిగి శివాలయం, సురికి Sవీరాంజనేయస్వామి ఘాట్లను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. వాడపల్లిలో ఘాట్ల పర్యవేక్షణ మిర్యాలగూడ : వాడపల్లి సంగమంలో ఉన్న ఘాట్లను రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యవేక్షించారు. దామరచర్ల మండలం కొండ్రపోల్ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన మంత్రులు రోడ్డు మార్గం మీదుగా వాడపల్లికి చేరుకున్నారు. శివాలయం ఘాట్‌లోకి నేరుగా వెళ్లిన మంత్రులు కృష్ణమ్మ నమస్కారం చేసి చేతులతో నీళ్లు తీసుకుని నెత్తిన చల్లుకున్నారు. అనంతరం భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిలకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఏజేసీ వెంకట్రావు అడిషనల్ ఎస్పీ గంగారామ్, ట్రైనీ ఎస్పీ చందనాదీప్తి, డీఎస్పీ సునితామోహన్, డీఆర్డీఏ పీడీ అంజయ్య, డీఎస్ఓ అమృతారెడ్డి, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్, ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ కర్నాటì æలింగారెడ్డి, టీఆర్ఎస్ నల్లగొండ, సాగర్ నియోజకవర్గాల ఇన్చార్జిలు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సీఐ ఇ.రవీందర్, అధికారులు చంద్రవదన, సురేందర్, ఆలయ కమిటీ చైర్మన్ గుంట్ల అనంతరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు బాలాజీనాయక్ తదితరులు ఉన్నారు. -
విష పదార్థాలు తిని పాడిగేదెలు మృతి
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి అటవీ ప్రాంతంలో విష పదార్థాలను తిని రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మట్టపల్లికి చెందిన బచ్చలకూరి గురవయ్యకు చెందిన మూడు పాడిగేదెలు ఉదయం మేతకు వెళ్లాయి. సాయంత్రం ఒక గేదె మాత్రమే ఇంటికి వచ్చి నోటి వెంట నురగలు కక్కుతుండడంతో పశు వైద్య సిబ్బందితో చికిత్స నిర్వహించారు. మిగిలిన రెండు గేదెల కోసం అడవి వెతకగా మృతి చెంది ఉన్నాయి. అడవిలో విష పదార్థాలు తినడం వల్లే గేదెలు మృతి చెందాయని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరారు. కాగా గేదెలు మృతిచెందిన స్థలాన్ని పశువైద్య సిబ్బంది సందర్శించారు. -
ఘాట్లను పరిశీలించిన మంత్రులు
మట్టపల్లి (మఠంపల్లి) : మట్టపల్లిని పుష్కర ఘాట్లను మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ, విద్యుత్‌శాఖ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు పరిశీలించారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి వారు హెలికాప్టర్లో మట్టపల్లిలోని ఎన్సీఎల్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగారు. ఈ సందర్భంగా వారికి ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్‌లో బయలుదేరి వెళ్లి ప్రహ్లాద ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తిరిగి వెళ్లారు. వారి వెంట స్పెషల్ ఆఫీసర్ అంజయ్య, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డీఎల్పీఓ రామ్మోహన్‌రాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, ఎంపీపీ అంజమ్మ బుచ్చయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, లక్ష్మీవెంకటనారాయణ, కొండానాయక్, పఠాన్హుస్సేన్, సర్పంచ్ కనగాల శ్రీనివాసరావు, కుంట సైదులు, యరగాని గురవయ్యగౌడ్, ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధుల నిరసన ఘాట్ల వద్దకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలోకి వెళ్తున్న మంత్రులను స్థానిక మీడియాసెంటర్ వద్ద పలువురు పాత్రికేయులు అడ్డుకున్నారు. ఘాట్ల వద్ద పోలీసులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వెంటనే స్పందించిన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రోడ్డు స్టాపర్స్ అందజేత
మఠంపల్లి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు స్థానిక మై హోం సిమెంట్స్ పరిశ్రమ ఆధ్వర్యంలో రోడ్డు స్టాపర్స్, హై విజబిలిటీ జాకెట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమ జనరల్ మేనేజర్ జగన్నాథరావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు గాను పరిశ్రమ ఆధ్వర్యంలో 30 రోడ్డు స్టాపర్స్, మరో 30 హైవిజబులిటీ జాకెట్స్‌ను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ అధికారులు రాజేశ్వరరావు, శ్రీనివాసులు, త్రిలోచనుడు ఉన్నారు. -
పుష్కర ఘాట్లను పరిశీలించిన డీఆర్డీఏ పీడీ
మట్టపల్లి (మఠంపల్లి) : ఈనెల 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని పుష్కరాల స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీఏ పీడీ అంజయ్య పేర్కొన్నారు. మండలంలోని మట్టపల్లి వద్ద నిర్మించిన పుష్కరఘాట్లను ఆయన సోమవారం సందర్శించారు. అనంతరం స్థానిక ఎన్సీఎల్ పరిశ్రమ అతిథిగృహంలో పుష్కర ఘాట్ల ఇన్చార్జి, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సౌకర్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఏ ఒక్క ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్ఓ అమృతారెడ్డి, టీసీఓ సాయప్ప, జిల్లా రిజిష్ట్రార్ వాసుదేవరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజశేఖర్, డీఎల్పీఓ రామ్మోహన్‌రాజు, తహసీల్దార్ యాదగిరి, ఈఓపీఆర్డీ జానకిరాములు, పంచాయతీ కార్యదర్శులు గురవయ్య, గిరిజాకుమారి, శ్రీవిద్య, సుధాకర్, నాగేశ్వరరావునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శివాలయ ప్రతిష్ఠ
మట్టపల్లి (మఠంపల్లి): మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పార్వతీ రామలింగేశ్వరాలయం విగ్రహ ప్రతిష్ఠలు, జీవధ్వజ ప్రతిష్టాపనను వేద పండితులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, గర్తన్యాసం, బీజవ్యాపం, రత్నవ్యాపం నిర్వహించారు. ఉదయం గం.9.32ని.లకు యంత్రస్థాపన, బింబస్థాపన, కలాన్యాసంతో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలను నిర్వహించారు. అదేవిధంగా హోమాలు, దృష్టి కుంభం, దేమదర్శనం, బింబదర్శనం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం నిర్వహించారు. సాయంత్రం శ్రీగంగా పార్వతీసమేత శ్రీరామలింగే శ్వర స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, యజ్ఞకర్తలు సోమయాజుల లక్ష్మీనర్సింహశాస్త్రి, కల్వకొలను పురుషోత్తమశర్మ, మార్తి దుర్గాప్రసాద్ శర్మ, సోమయాజుల సూర్యనారాయణమూర్తి, లక్ష్మీనర్సింహమూర్తి, శివరామకృష్ణ శర్మ, నాగభూషణశర్మ, సుబ్బారావుశాస్త్రి, సత్యనారాయణశాస్త్రి పాల్గొన్నారు. -
రసాభాసగా ముగిసిన మండల సభ
మఠంపల్లి : స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఎంపీపీ అంజమ్మబుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం కేవలం 10 నిమిషాల్లోనే రసాభాసాగా ముగిసింది. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీపీ మాట్లాడుతుండగా ఇటీవల మంజూరైన మాడా రుణాల వివరాలు తెలపాలని వైఎస్ ఎంపీపీ సయ్యద్బీబీతో పాటు మరో ముగ్గురు ఎంపీటీసీలు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ, ఈఓఆర్డీ జానకీరాములుతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు వాగ్వాదానికి దిగారు. దీనికి తోడు బయట ఉన్న పలువురు ఎంపీటీసీల భర్తలు, బయటి వ్యక్తులు సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు, వారి అనుచరులు కుర్చీలు విరగ్గొడుతూ వీరంగం సృష్టించారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ సమావేశం ముగిసినట్లుగా ప్రకటించి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనుల నిమిత్తం పూర్తిస్థాయిలో అధికారులు హాజరయ్యే పరిస్థితి లేనప్పటికీ సమావేశం నిర్వహించామని అన్నారు. సమావేశాన్ని ప్రారంభించకుండానే నలుగురు ఎంపీటీసీలు బయటి వ్యక్తులతో కలిసి గొవడ సృష్టించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ సయ్యద్బీబీ, ఎంపీటీసీలు సోవమ్మ, దస్రు, రంగమ్మ, సామ్యేలు, జయమ్మ, నాగు, బాల, ఈఓఆర్డీ జానకీరాములు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డీటీ బాలాజీనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సమావేశ మందిరంలోకి వచ్చి గొడవకు దిగిన వ్యక్తులపై ఎంపీపీ అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యులంతా హాజరైనప్పటికీ సభను వాయిదా వేయడం సరికాదంటూ జెడ్పీటీసీ నీలా మంజీనాయక్, జెడ్పీకోఆప్షన్ సభ్యుడు రాజారెడ్డిలు అన్నారు. అనంతరం మాడా రుణాలపై విచారణ జరిపించాలని కోరుతూ ఈఓఆర్డీకి వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయింపు సమావేశం ముగించి ఎంపీపీ ఛాంబర్లోకి వెళ్లగానే సమావేశంలో ఆందోళన చేసిన నలుగురు ఎంపీటీసీలు ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సయ్యద్బీబీ మాట్లాడుతూ మండల పరిషత్‌లో గౌరవ సభ్యులకు తగిన ప్రాతినిధ్యం లేదని, ఇటీవల మంజూరైన మాడా రుణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద జరిగే పుష్కరాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సూర్యాపేట డీఎస్పీ సునీతా మోహన్ తెలిపారు. గురువారం ఆమె మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి నూతనంగా నిర్మించిన మట్టి రోడ్డును, చెన్నైకి చెందిన ముక్కూరు స్వామి ఆశ్రమాన్ని, గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాల పనులు పూర్తి అవుతున్నందున పోలీస్, అగ్ని మాపక కేంద్రాల ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నామన్నారు. దేవస్థానం సమీపంలోకి కేవలం వీఐపీ, వీవీఐపీల వాహనాలు మాత్రమే అనుమతిస్తామన్నారు. మిగిలిన వాహనాలన్నీ ఎన్సీఎల్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలోనే నిలిపివేస్తామన్నారు. ఆమె వెంట సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఉన్నారు. -
ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి
మట్టపల్లి (మఠంపల్లి): హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు సూచించారు. సోమవారం మండలంలోని మట్టపల్లిలో జరుగుతున్న కృష్ణా పుష్కర పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు స్థానిక ఎన్సీఎల్ సమీపంలోని ప్రధాన రహదారి వెంట నూతనంగా నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డుపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు పులిచింతల ముంపులో నష్టపరిహారం ఇచ్చిన అధికారులు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని మత్స్యకారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. అదేవిధంగా మండలంలోని అమరవరం ఎత్తిపోతలను వెంటనే ప్రారంభించాలని స్థానిక ప్రజాప్రతిని«ధులు మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, నాయకులు సాముల శివారెడ్డి, కాసోజు శంకరమ్మ, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.కృష్ణంరాజు, ఎం.కృష్ణగౌడ్, ఎం.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ అంజమ్మ బుచ్చయ్య, మాజీ ఎంపీపీలు లక్ష్మీ వెంకటనారాయణ, కొండానాయక్, నర్సింగ్ వెంకటేశ్వర్లుగౌడ్, నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు శ్రీనివాసరావు, పిచ్చిరెడ్డి, ఎంపీటీసీలు జయమ్మ, రంగమ్మ, సీఐ నర్సింహారెడ్డి, తహసీల్దార్ యాదగిరి, ఎంపీడీవో శాంతకుమారి, ఎస్ఐ రమేష్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు. -
పుష్కరాల విజయవంతానికి సహకరించాలి
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద ఆగస్టు 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు స్థానికంగా ఉన్న అన్ని వర్గాలు, శాఖలు సహకరించాలని తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ ఆకుల రమేశ్ కోరారు. మంగళవారం మట్టపల్లిలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో వివిధ కులాల అన్నదాన సత్ర కమిటీలతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పుష్కరాల విజయవంతానికి దేవస్థానం, అన్నదానసత్రాలు, స్థానిక గ్రామపంచాయతీ, ఆర్టీసీ తదితర శాఖలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అన్నదాన సత్ర కమిటీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఆర్ఐ శైలజ, చల్లా రామ్మూర్తి, దాసా నాగేశ్వరరావు, తండు వెంకటరత్నంగౌడ్, ఎన్.అంజయ్యగౌడ్, ఎ.శౌరెడ్డి, పి.రామారావు, ఎం.వెంకటేశ్వర్లు, మట్టపల్లిరావు, గిరిబాబు, చంద్రశేఖరశర్మ, అశోక్, ఎం.ఎం. యాదవ్, మాల్యాద్రి, బుచ్చయ్య, అనంతరాములు, రమేష్, కార్యదర్శి గురవయ్య, వీఆర్ఓ వెంకటరామారావు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని రాస్తారోకో
బక్కమంతులగూడెం (మఠంపల్లి): మండలంలోని బక్కమంతులగూడెంకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని కోరుతూ సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు శనివారం మట్టపల్లి–హుజూర్నగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంభం బొర్రయ్య, ఎంపీటీసీ మామిడి సోవమ్మ శ్రీనివాసులు మాట్లాడుతూ 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆరు మాసాల క్రితమే విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేసిందని, ఇందుకుగాను తమ గ్రామ సమీపంలోని డొంక వద్ద సర్వేనం. 489లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామన్నారు. ఆ స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇప్పించేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. కాగా విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆకుల రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తహసీల్దార్ యాదగిరికి ఫోన్ చేసి సమస్య వివరించారు. దీంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బేత ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ గంగసాని వెంకటరెడ్డి, బలుపునూరి వెంకటరెడ్డి, వల్లపుదాసు వెంకన్న గౌడ్, పుల్లారెడ్డి, వెంకన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మఠంపల్లి : పాలమూరు జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల సాగు కోసం ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల చేయడం పట్ల టీఆర్ఏస్ నాయకులు గురవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కోలాహలం కృష్ణంరాజు మాట్లాడుతూ ఏళ్ల తరబడి తాగు, సాగు నీటికి నోచుకోని పాలమూరు బీడు భూములను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామలం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం కే సీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు జయమ్మహుస్సేన్గౌడ్, రుక్కిబాలునాయక్, మండల మాజీ అధ్యక్షుడు పోతబత్తిని శ్రీనివాస్, బీసీ సెల్‌మండల అధ్యక్షులు పిల్లుట్ల కొండలు, యల్లావుల నాగయ్యయాదవ్, నర్సింహారెడ్డి, బాలాజీనాయక్, వెంకన్న, వీరన్న పాల్గొన్నారు. -
రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు
మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మట్టపల్లి పుష్కర ఘాట్ వచ్చే భక్తుల కోసం రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్ అండ్ బీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ తెలిపారు. మంగళవారం ఆయన మట్టపల్లి సమీపంలోని సుల్తాన్‌పూర్‌తండా రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 25 ఎకరాల విస్తీర్ణంలో ఆరు పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మట్టపల్లిలోని కృష్ణా జలాల పంప్ హౌస్ వద్ద ఒక పార్కింగ్, సుల్తాన్పూర్ తండా రోడ్డు సమీపంలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాలుగు పార్కింగ్లు, మండల కేంద్రమైన మఠంపల్లి సమీపంలో మరో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈ వెంకటయ్య, ఏఈ రాజశేఖర్, మాజీ ఎంపీపీలు కొండానాయక్, లక్ష్మీవెంకటనారాయణ పాల్గొన్నారు.