Published
Wed, Sep 14 2016 10:13 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
మట్టపల్లిలో పెరుగుతున్న కృష్ణానది నీటి మట్టం
మట్టపల్లి (మఠంపల్లి) : జిల్లాలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద గల కృష్ణానది నీటి మట్టం రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. దీంతో దేవస్థానం వద్ద ప్రహ్లాద ఘాట్‌లోకి భక్తులు వెళ్లకుండా మూసివేశారు. అదేవిధంగా మట్టపల్లి రేవు వద్ద మత్స్యకారులు చేపల షికారుకు వెళ్లే పరిస్థితి నిలిచిపోయింది. కృష్ణానదికి కింది భాగంలో ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ వద్ద సుమారు 19 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిల్వ చేసింది. దీంతో బ్యాక్ వాటర్ మట్టపల్లి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇటీవల నిర్మించిన పుష్కర ఘాట్లు ప్రహ్లాద, బాలాజీ, హైలెవల్‌వంతెన కుడి, ఎడమ ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో మట్టపల్లి రేవు భారీ రిజర్వాయర్‌గా తలపిస్తుంది. గణేష్ నిమజ్జనాలకు వచ్చిన భక్తులు కృష్ణానది నీటి మట్టాన్ని ప్రత్యేకంగా తిలకిస్తున్నారు.