'కులాల పేరుతో ప్రజలను చీల్చొద్దు'
విజయవాడ: కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనలు ఆందోళన కలిగించాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాపుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సమావేశానికి తరలివెళ్లినవారు తిరిగి క్షేమంగా తిరిగివస్తారా లేదా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. తమను నమ్మి వచ్చినవాళ్ల బాగోగులను నాయకులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
కాపు ఐక్య గర్జనకు కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. తుని ఘటనలకు బాధ్యులైన వారు ఖండించకపోవడం విచారకరమని అన్నారు. నాయకులు హుందాగా వ్యవహరించాలని కులాల పేరుతో ప్రజలను చీల్చొద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి లేకుండా చేస్తూ యువత మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం క్షమరాని నేరమని అన్నారు.