తూతూమంత్రం
- తొలిరోజు హడావుడిగా జన్మభూమి సభలు
- ఒక్కో నియోజకవర్గంలో పదికి పైగా నిర్వహణ
- పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు
- సమస్యలు చెబితే చీదరింపులు, భౌతికదాడులు
- టీడీపీ మినహా ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసులు బేఖాతర్
- టీడీపీ కార్యక్రమంలా సాగుతోన్న జన్మభూమి
‘‘నాకు సమయం లేదు. అవతల బోలెడు పెళ్లిళ్లు ఉన్నాయి. పెళ్లికుమారుడు, పెళ్లికుమారై సిద్ధంగా ఉంటే 'మాంగల్యం తంతునానేనా?' అని రెండుమంత్రాలు చదవి వెళ్లిపోతా. అర్థమైందా!’’
–ఇవీ ‘అందరివాడు’ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం డైలాగులు.
అచ్చం ఇలాగే ఉంది జన్మభూమి సభల నిర్వహణ తీరు. '11 చోట్ల సభలు నిర్వహించాలి. త్వరగా కానివ్వండి. మేం ప్రసంగించి వెళ్లిపోతాం. సమస్యలుంటే కాగితంపైన రాయండి. పింఛన్, ఇళ్లు ఇతరత్రా దరఖాస్తులుంటే వీఆర్‌ఏ 24గంటలూ మీ ఊరిలోనే ఉంటారు. వారికి ఇవ్వండి. వారు మా వద్దకు తెస్తారు’ అంటూ ఎమ్మెల్యేతో పాటు అధికారులు హడావుడిగా నాలుగు మాటలు మాట్లాడి పది నిమిషాల్లోనే సభను ముగించి వెళ్లిపోతున్నారు. దీనికి కారణం ఓ ప్రణాళిక లేకుండా, రోజూ పదికంటే ఎక్కువగా సభలను నిర్వహించడమే. ఏదో సభ నిర్వహించామని చెప్పుకునేందుకు మినహా ప్రజాప్రతినిధులు, అధికారులు సామాన్యుల మొర ఆలకించడం లేదు. ఒక సభలో ఎమ్మెల్యే, మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ ప్రసంగాలతో పాటు ఒక్కోశాఖ నుంచి ఒక్కో అధికారి మాట్లాడినా కనీసం గంటన్నర పడుతుంది. గ్రామస్తుల సమస్యలు విని, అర్జీలు తీసుకునేందుకు మరో గంటన్నర. ఈ లెక్కన ఓ సభ మామూలుగా జరిగినా 3గంటలు అవసరం. కానీ తొలిరోజు శింగనమలలో 13, ధర్మవరంలో 11 చోట్ల సభలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సభలు నిర్వహిస్తున్నారు. ప్రయాణ సమయం, మధ్యాహ్న భోజన సమయం తీసేస్తే ప్రతి గ్రామంలో 20–30నిమిషాలకు మించి సభ జరగడం లేదు. చాలా గ్రామాలకు నోడల్ ఆఫీసర్ మినహా ఎమ్మెల్యే, ఎంపీడీవో, తహశీల్దార్‌తో పాటు చాలామంది గైర్హాజరవుతున్నారు.
అర్జీదారులపై దౌర్జన్యాలు, దాడులు
అనంతపురంలోని 33వ డివిజన్‌లో ప్రకాశ్‌గౌడ్ అనే మానసిక వికలాంగుడు గతేడాది జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ రాలేదు. ఈ ఏడాది దరఖాస్తు తీసుకుని స్థానిక విద్యుత్‌నగర్ సర్కిల్‌లో ‘నాకు పింఛన్ ఇప్పించండి’ అంటూ ఫ్లకార్డు పట్టుకుని కమిషనర్ వాహనానికి అడ్డుగా వెళ్లాడు. సమస్యను సావధానంగా వినాల్సిన ప్రజాప్రతినిధులు మానసిక వికలాంగుడని చూడకుండా రెచ్చిపోయారు. మొదట కమిషనర్ డ్రైవర్, ఆపై సులోచన అనే టీడీపీ కార్యకర్త చేయిచేసుకున్నారు. ఆపై కార్పొరేటర్లు సరిపూటి రమణ, నటేశ్ చౌదరి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది చూసిన స్థానికులు టీడీపీ నేతల శైలిపై దుమ్మెత్తిపోశారు.
జన్మభూమి సభల్లో చాలాచోట్ల విపక్ష పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్న సర్పంచ్‌లు, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం నూతిమడుగులో టీడీపీకి చెందిన దళిత సర్పంచ్ నరసింహులు తనను అగౌరవ పరుస్తూ, ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆవేదనతో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. సభలోని ప్రజలు అడ్డుకున్నారు. మూడేళ్లుగా అవమానాలకు గురవుతున్నానని, ఎవరూ తనను సర్పంచ్‌గా గుర్తించడం లేదని, స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి తెలిపినా పట్టించుకోలేదని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం నేమకల్లులో తాగునీటి కోసం హెచ్చెల్సీ నుంచి వస్తున్న పైపులైన్‌ను దారి మళ్లించి క్రషర్లకు తరలించారని, చాలాసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ‘మా ఇంటికి మహాలక్ష్మి’ ప్రోత్సాహక నగదును ఇంతవరకూ బ్యాంకులో జమ చేయలేదని కురవళ్లిలో వీరేశ్ అనే వ్యక్తి నిలదీశాడు. శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండలం దంతపల్లిలో గంగయ్య అనే వృద్ధుడు ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం తల్లిమడుగులో జన్మభూమి సభకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. పొలాలకు వెళ్లే రహదారి వివాదంపై నిలదీశారు. ఆత్మకూరు మండలం. పి.యాలేరులో ఇన్‌పుట్‌సబ్సిడీ జాబితాలో టీడీపీ సానుభూతి పనుల పేర్లు మినహా ఇతరుల పేర్లు చేర్చడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. జాబితా పూర్తికాలేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి జన్మభూమి సభలోనూ తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు నిలదీశారు.