బ్యాంకుల్లో డబ్బుల్లేవ్‌ | . Many banks in the district see no cash board. | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో డబ్బుల్లేవ్‌

Published Fri, Jun 30 2017 5:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

బ్యాంకుల్లో డబ్బుల్లేవ్‌

బ్యాంకుల్లో డబ్బుల్లేవ్‌

రుణ పంపిణీలో ఇబ్బందులు..
లక్ష్యం కొండంత.. పంపిణీ గోరంత..
అప్పుల కోసం అన్నదాత అగచాట్లు..
పట్టించుకోని బ్యాంకర్లు..

ఆదిలాబాద్‌టౌన్‌: ఖరీఫ్‌ బ్యాంకు రుణాల పంపిణీలో నత్తేనయం అన్నట్లు ఉంది. ఈ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురిసినప్పటికీ బ్యాంకు రుణాలు అందకపోవడంతో అన్నదాతలు అగచాట్లు పడాల్సి వస్తోంది. బ్యాంకుల ముందు రోజు గంటల తరబడి వేచి ఉంటున్నా డబ్బులు చేతికి అందని దుస్థితి నెలకొంది. జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నో క్యాష్‌ బోర్డు దర్శనమిస్తోంది. అవసరమైన మేరకు నగదు లేకపోవడం.. ఇచ్చే అరకొర రుణాలు కూడా ఖాతాలో జమ చేస్తున్నారు. ఏటీఎంలలో సైతం డబ్బులు లేకపోవడంతో అన్నదాతల కష్టాలు వర్ణణాతీతం. గత ఏడాది కంటే ఈ ఏడాది 42 శాతం రుణ లక్ష్యం పెంచినప్పుటికీ పంపిణీ నత్తనడకన సాగుతుండడంతో కష్టాలు తప్పడం లేదు..

జిల్లాలో..
జిల్లాలో లక్షా 40 వేల మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 96 గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఉన్నాయి. గత ఏడాది ఖరీఫ్‌ పంట రుణ లక్ష్యం రూ.842.30 కోట్లు కాగా ఈ ఏడాది వార్షిక ప్రణాళిక రుణ లక్ష్యం రూ.1328.53 కోట్లు.. ఇప్పటి వరకు కేవలం రూ.115 కోట్లు పంపిణీ చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.400 కోట్ల వరకు పెంచినప్పటికీ రుణ పంపిణీ ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది కనీసం 50 శాతం కూడా పూర్తవుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో బ్యాంకు రుణాలు పంపిణీ చేయలేదు. రుణæ పంపిణీ కాగితాల్లోనే కనిపిస్తోంది.

పంపిణీ చేసేదెప్పుడు..
ఇప్పటికే 60 శాతం పైగా రైతులు పంటలు విత్తుకున్నారు. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో దళారులను ఆశ్రయించి అధికవడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నప్పటికీ బ్యాంకు రుణం జాప్యం అవుతోంది. ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తాయి. ఎరువులు, కలుపు, ఇతర పనుల కోసం డబ్బులు అవసరం ఉండగా.. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో మొలకెత్తుతున్న పంటను చూస్తూ దిగాలు పడడమే తప్ప ఏమీ చేయని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ నుంచి మొదలు పెడితే జూలై నెలాఖరు వరకు రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చే వారు కానీ ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

కొంత మొత్తంలోనే నగదు
జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రుణాల పంపిణీ ప్రారంభించినప్పటికీ కొంత మొత్తంలోనే డబ్బులను ఇస్తున్నారు. మిగతావి అకౌంట్లలో జమ చేస్తున్నారు. రుణ పంపిణీలో గ్రామీణ బ్యాంకులు కొంచెం ముందు వరుసలో ఉన్నా, సహకార బ్యాంకులు 20 శాతం కూడా పంపిణీ చేయలేదు. మరికొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే రుణాలను ప్రారంభిస్తున్నాయి. ఏటీఎంలలో సైతం డబ్బులు అందుబాటులో లేవు. ఒక్కో రైతు ఐదారు సార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 2017–18 సంవత్సరానికి గానూ బ్యాంకుల వార్షిక ప్రణాళికను రెండు, మూడు రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యం రూ.251.39 కోట్లు, సహకార బ్యాంకు రూ.149.43 కోట్లు, ఎస్‌బీఐ రూ.289.39 కోట్లు, మహారాష్ట్ర బ్యాంకు రూ.96.80 కోట్లు, ఆంధ్రాబ్యాంకు రూ.78.68 కోట్లు, ఇతర బ్యాంకులు రూ.443.53 కోట్లు రుణాలు అందించేందుకు లక్ష్యం ప్రకటించారు. గత ఏడాది కంటే 42 శాతం పెంచినా అందించే లక్ష్యం ముందుకు సాగడం లేదు.

రెండు విడతల్లో రూ.30 వేలు..
నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయం ఉంది. ఇచ్చోడలోని దక్క¯Œన్‌ గ్రామీణ బ్యాంకు వ్యవసాయ రుణం రూ.లక్షా 30 వేలు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.30 వేలు మాత్రమే ఇచ్చింది. మిగతా డబ్బుల కోసం చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న. అధికారులు స్పందించి రుణాలు త్వరగా ఇప్పిస్తే మంచిగుంటది.                                                            – నాందేవ్, గ్రామం : కిన్నెరపల్లి, మం : బజార్‌హత్నూర్‌

15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న..
ఇచ్చోడలోని దక్కన్‌ గ్రామీణ బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరుగుతున్న. నాకు రూ.30 వేల రుణం మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. రూ.20 వేల కోసం గత 15 రోజులుగా బ్యాంకుకు తిరుగుతున్న. అధికారులు పట్టించుకోవడం లేదు. రేపు మాపు అనడంతో ఎవుసం కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న.
– ఇక్బాల్, గ్రామం : గుండాల, మం : ఇచ్చోడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement