రోను తుఫాన్ ప్రభావంతో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాత్రి 7. 20 గంటలకు విజయవాడ బయలుదేరాల్సిన ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ నుంచి రాత్రి 9. 40 గంటలకు ఇక్కడికి చేరుకోవాల్సిన ఇదే ఎయిర్‌లైన్స్ విమానం కూడా రద్దయింది.
ఇక రాత్రి 9 గంటలకు చెన్నై వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని అధికారులు ప్రకటించారు. రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఆలస్యంగా బయలు దేరుతున్నట్లు సమాచారం. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న విమానాలు కూడా ఆలస్యంగా నడవనున్నట్లు అధికారులు తెలిపారు.