నేడు మావోల బంద్
జిల్లా పోలీసులు అలర్ట్
నగరంలో వాహనాల తనిఖీలు
లాడ్జీల్లో సోదాలు
నిజామాబాద్ క్రైం : ఆంధ్ర, ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గత నెల 25న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏవోబీలో ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలతో పాటు 30 మంది మృతిచెందడంతొ మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సంఘటనకు నిరసనగా గురువారం మావోలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కేంద్రంలోకి వచ్చే వాహనాలను నగర శివారు ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని పలు లాడ్జీలలో పోలీసులు విసృ్తతంగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని వచ్చే వాహనాలను బోధన్‌రోడ్డులోని సారంగపూర్, హైదరాబాద్ రోడ్డులోని బోర్గాం(పి), ఆర్మూర్ రోడ్డులోని కంఠేశ్వర్ ప్రాంతం, వర్నిరోడ్డులోని నాగారం ప్రాంతాలలో ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు వాహనాలను తనిఖీ చేశారు.
అలాగే జిల్లాలోని జాతీయ రహదారులపై బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం వరకు వాహనాలను తనిఖీలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అనుమానం వచ్చిన వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నగరంలోకి ఎందుకు వస్తున్నారు. ఎటు వెళ్తున్నారో వివరాలు సేకరించి వదిలిపెట్టారు. జిల్లాలో 1986 నుంచి నక్సల్స్ ప్రభావం తీవ్రమైంది. సిర్నపల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్, అలాగే కామారెడ్డి దళాల పేర్లతో కార్యకలాపాలు కొనసాగించారు. ప్రస్తుతం జిల్లాలో నక్సల్ కార్యకలాపాలు లేకున్నప్పటికి ైపోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మాజీలు, సానుభూతి పరులపై నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని సూచించినట్లు సమాచారం. ఇక నక్సల్స్ ప్రభావిత మండలాలు, గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తుకు సీపీ ఆదేశాలు జారీ చేశారు.