మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడికి యావజ్జీవ శిక్ష
కరీంనగర్ : మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేసిన ఉగ్గే చంద్రమౌళికి మధ్యప్రదేశ్లోని బాల్‌గఢ్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం బాల్గఢ్ న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన ఉగ్గే చంద్రమౌళి 1981లో మావోయిస్ట్ దళ సభ్యుడిగా చేరాడు. అనతి కాలంలోనే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు.
కాగా, 2005లో మధ్యప్రదేశ్ రవాణాశాఖ మంత్రి హత్య కేసులో చంద్రమౌళిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో 2005లో మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసును విచారించిన బాలాగఢ్ న్యాయస్థానం శుక్రవారం చంద్రమౌళిని ప్రధాన నిందితుడిగా గుర్తించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.