గోదావరి జిల్లాలో మావోయిస్టుల అలజడి మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగ గ్రామాల నడుమ రహదారిపై మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి మూడుచోట్ల కందకాలు తవ్వారు. సుమారు 20 చెట్లను నరికి రహదారికి అడ్డంగా పడేశారు. మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో పలుచోట్ల పోస్టర్లు, కరపత్రాలను వదిలి వెళ్లారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పేగ, అల్లిగూడెం, మల్లంపేట గ్రామాలకు ఏడుగురాళ్లపల్లి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు నెల్లిపాక, చింతూరు జాతీయ రహదారిలోని కాటుకపల్లి వద్ద కూడా మావోయిస్టులు పోస్టర్లు వెలిశాయి. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మావోయిస్టు సెంట్రల్ రీజనల్ బ్యూరో (సీఆర్‌బీ) మే 4, 5 తేదీల్లో తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు.
ప్రజలపై, విప్లవోద్యమాలపై ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు కరపత్రాల్లో మావోయిస్టు పార్టీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుల నిర్వాసిత మండలాల పీడిత ప్రజలకు అన్యాయం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
కూంబింగ్ ముమ్మరం
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారి తవ్వకాల విషయాన్ని తెలుసుకున్న అధికారులు రోడ్లపై ఉన్న చెట్లను తొలగించి, కందకాలను పూడ్చారు. దీంతో ఈ దారిలో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. మరోవైపు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు చింతూరు సీఐ దుర్గారావు తెలిపారు.
గోదావరి జిల్లాలో మావోయిస్టుల అలజడి
Published Tue, May 3 2016 7:08 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement