నిర్వాసితులకు మస్కా
Published Fri, Sep 22 2017 1:10 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
వేలేరుపాడు: పోలవరం భూసేకరణలో భాగంగా ఎసైన్‌మెంట్ భూములకు పరిహారం అందించే విషయంలో అనేక మంది నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగింది. అధికారులు ఎంజాయిమెంట్ సర్వే అనంతరం నోటీసు బోర్డులో పేర్లు ప్రకటించి, అవార్డు కూడా పాస్ చేశారు. అవార్డులో విస్తీర్ణం, పరిహారం ఎంత అన్నది స్పష్టంగా ఉన్నప్పటికీ, తుది జాబితాలో మాత్రం పరిహారం ఎంతో తేల్చలేదు. ఫలితంగా నిర్వాసితులకు భూ నష్ట పరిహారం నేటికీ అందలేదు. ఈ తప్పిదం ఎక్కడ జరిగిందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 18,730 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 16,025 ఎకరాలు సేకరించారు. ఇందులో 14,000 ఎకరాల పట్టా భూమి ఉండగా, 2025 ఎకరాల అసైన్ భూమి ఉంది. ఈ రెండు
మండలాల్లో మొత్తం 7,300 మంది రైతులకు ఇప్పటివరకు రూ.1270 కోట్ల పరిహారం అందించారు. అయితే వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము రెవెన్యూ పరిధిలో ఎసైన్‌మెంట్ భూములకు పరిహారం పంపిణీ గందరగోళంగా ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటూ సాగుదారులుగా కొనసాగుతున్న 28 మంది నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించకుండా మొత్తం 56 ఎకరాల భూమికి ఏకంగా నిండు సున్నాగా ప్రకటించడం వింతగా ఉంది.
సున్నా జాబితాలో ఎంతో మంది నిర్వాసితులు
అధికారులు ప్రకటించిన పరిహారం బిల్లులో మాత్రం సున్నాగా వచ్చిన నిర్వాసితులు అనేక మంది ఉన్నారు. పూచిరాల గ్రామానికి చెందిన సోడే చెల్లెమ్మకు 301, 218, 370 సర్వే నంబర్‌లలో 2.28 ఎకరాల భూమికి గాను రూ.28,35,000 పరిహారంగా ప్రకటించారు. 329, 330 సర్వే నంబర్‌లలో పిట్టా రమేష్‌కు 5.28 ఎకరాలుండగా రూ.59,85000, 329, 218‡ సర్వే నంబర్‌లలో పిట్టా మారయ్య పేర 4.19 ఎకరాలుండగా రూ.49,35,000, 329, 218 సర్వే నంబర్‌లలో పిట్టా రాములు పేర ఉన్న 4.25 ఎకరాలకు రూ.48,30,000, 330 సర్వే నంబర్‌లో పిట్టా ముత్తమ్మ, రాములమ్మ పేర ఉన్న 3.16 ఎకరాలకు రూ.35,75,000, ఇంకా 192 సర్వే నంబర్‌లో గారా హనుమంతురావు, కుచ్చర్లపాటి జయరావు, కుచ్చర్లపాటి సత్యనారాయణలకు ఇలా పరిహారం ప్రకటించి బిల్లులో అంతా మాయ చేశారనే ఆరోపణలు నిర్వాసిత రైతుల నుంచి విన్పిస్తున్నాయి.
భూమి లాక్కుని రూపాయీ ఇవ్వలే
ఈ గిరిజనుడి పేరు బీరబోయిన దేశయ్య. పూచిరాల గ్రామం. ఇతడికి రేపాకగొమ్ము రెవెన్యూ పరిధిలోని 384, 218 సర్వే నెంబర్‌లలో 3 ఎకరాల 25 కుంటల భూమి ఉంది. ఈ భూమికి రూ. 38,06,250 పరిహారంగా ప్రకటించారు. తుది జాబితాలో సున్నాగా చూపారు. ఈ గిరిజనుడు ఇప్పటికి ఐదారుసార్లు కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి తిరిగినా అధికారుల నుంచి సరైన సమాధానం రావడంలేదు. ఈ సున్నాకు అర్థమేమిటో అధికారులకే తెలియాలి.
అవార్డులో మూడెకరాల ఆరుకుంటలు ఉంటే.. తుది జాబితాలో సున్నా
ఈమె పేరు కమటం చిట్టెమ్మ. నడిమిగొమ్ము గ్రామం. రేపాకగొమ్ము రెవెన్యూలో సర్వే నెంబర్ 165/1 లో ఈమె పేర 3.06 ఎకరాల భూమి ఉంది. గత 32 ఏళ్లుగా ఈ భూమి సాగుచేసుకుంటోంది. ఎంజాయిమెంట్ సర్వే చేసిన అధికారులు నోటీస్‌బోర్డులో పెట్టిన జాబితాలో పేరు ప్రకటించారు. ఈ భూమికి ఏప్రిల్ నెలలో అవార్డు పాస్ చేశారు. అవార్డులో రూ. 33,07,500 పరిహారంగా ప్రకటించారు. తనకు అందరితోపాటు పరిహారం వస్తుందని చిట్టెమ్మ గత నాలుగు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. పరిహారం సొమ్ము తన ఖాతాలో జమ అయ్యిందేమోనని అనేక సార్లు బ్యాంక్ చుట్టూ తిరిగింది. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి వెళితే డబ్బులు ఎకౌంట్‌లో పడతాయని అధికారులు చెప్పేవారు. కానీ అసలు బిల్లులో మాత్రం సున్నాగా ప్రకటించారు. æచిట్టెమ్మ భర్త శంకరయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి కూరగాయలు అమ్ముకొని జీవిస్తోంది. బిల్లులో తన భూమికి సున్నా ఉందని తెలియడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.
అసలు భూమిలేకుండా అవార్డు ఎలా పాస్ చేశారు...
ఈమె పేరు కుచ్చర్లపాటి కుమారి. ఎర్రబోరు గ్రామం. ఈమెకు రేపాకగొమ్ము రెవెన్యూలో 192 సర్వే నెంబర్‌లో 2.05 ఎకరాల భూమి ఉంది. అసలు భూమి లేకుండా అవార్డు పాస్ చేయడం అసాధ్యం. గత 20 ఏళ్లుగా ఇదే భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తోంది. రూ. 22,31,250 పరిహారంగా ప్రకటించిన అధికారులు కుమారి భూమికి అవార్డు పాస్ చేశారు. తుది బిల్లులో మాత్రం సున్నాగా పెట్టి ఉంచారు. ఈమెకు నేటి వరకు పరిహారం అందలేదు. ఆమె భర్త రాజారావు ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారుడు, కుమార్తెలను ఆమె తన రెక్కల కష్టంతో చదివిస్తోంది.
Advertisement
Advertisement