హోరెత్తిన మస్తానయ్య నామస్మరణ
గుంతకల్లు : పట్టణంలోని పాతగుంతకల్లు ఏరియా మస్తానయ్య నామస్మరణతో హోరెత్తింది. పాతగుంతకల్లులో వెలసిన హజరత్ మస్తాన్‌వలి 381వ ఉరుసు ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం షంషీర్ ఊరేగింపు శుక్రవారం వైభవంగా సాగింది. ఆనవాయితీలో భాగంగా స్వామి వారి పూలరథాన్ని (షంషీర్)లాగే గుర్రాన్ని నాగసముద్రం నుంచి ఈడిగ వంశస్తులు గురువారం సాయంత్రం తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున షంషీర్‌ను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
అనంతరం ఊరేగింపుగా దర్గా నుంచి గణచారి రెడ్డి కులస్తుల ఇంటికి చేరుకుంది. సాజెదినాసేన్ (పూజారులు) ప్రత్యేక ప్రార్థనలు చేసి, అక్కడి నుంచి పట్టణంలోని పక్కీర్లవీధి, కుమ్మరకట్టవీధి, కచేరికట్ట, ఊరి వాకిలి మీదుగా దర్గాకు తిరిగి చేరుకుంది. అశేష భక్త జనంతో దర్గా పరిసరాలన్నీ పోటెత్తాయి. స్వామి వారి ఊరేగింపులో ఎండు కొబ్బరి కాల్పించడానికి భక్తులు ఎగబడ్డారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా పాతగుంతకల్లులోని ప్రతి ఇల్లూ బంధు మిత్రులతో కిటకిటలాడింది.