మేట్ల అక్రమాలతో నష్టపోయిన వేతనదారులు
మేట్ల మేత
Published Wed, Sep 21 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
తప్పుడు మస్తర్లతో నిధుల స్వాహా
పనిచేయని వారి పేర్ల నమోదు
ఉపాధి వేతనదారుల గగ్గోలు
బలిజిపేట రూరల్: ఉపాధి పథకంలో సీనియర్ మేట్ల చేతివాటం పెరిగింది. తప్పుడు మస్తర్లతో నిధుల స్వాహా జరుగుతోంది. ఉపాధి వేతనదారులకు మొండిచెయ్యి మిగులుతోంది. తప్పుడు మస్తర్లతో సీనియర్ మేట్లు నిధులు స్వాహా చేస్తున్నారు.. అని ఉపాధి వేతనదారులు ముదిలి జనార్థన, పద్మ, భాగ్యం, స్వామినాయుడు తదితరులు ఆరోపించారు. ఉపాధి పథకంలో అక్రమాలపై వారందించిన వివరాలివి. సీనియర్ మేట్లు జి.సూర్యనారాయణ, మజ్జి లక్ష్మణరావు ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మక్కయి 2014–15 సంవత్సరం ఉపాధి నిధులు కాజేశారు. కష్టపడి పనిచేసిన వారికి లేకుండా వలస వెళ్లిన వారు, చదువుకున్నవారు, వద్ధుల పేర్లతో నిధులు కాజేశారు. దీనిపై ఉపాధి మామీ పథకం అధికారులకు వేతనదారులు ఫిర్యాదు చేశారు.
– విశాఖ కేజీహెచ్‌లో ఉన్న కె.నారాయణరావు, తాపీ పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావు, ఎం.సుదర్శనరావు, టి.దాలయ్య తదితరులు కలిపి మొత్తం 70 మంది పేర్లు తప్పుగా నమోదు చేసి వేలాదిరూపాయలు స్వాహా చేశారు. దొంగ మస్తర్లతో కె.నారాయణరావు పేరున రూ.1,000, మజ్జి శీనుకు రూ.4వేలు, సుదర్శనరావుకు రూ.572, దాలయ్యకు రూ.1,700, టి.నరసమ్మ పేరున రూ.5,730 స్వాహా చేశారు.
– 2015–16 సంవత్సరానికి చెందిన మురళీకష్ణ బందంలో పనిచేయని అలజంగి రామినాయుడు, అప్పలనరసమ్మల పేరున మస్టర్లు వేసి రూ.2,900 కాజేశారు. పనులకు వెళ్లని వారి పేర్లను నమోదు చేయడం, వచ్చిన డబ్బును చెరిసగం పంచుకోవడం చేస్తున్నారు. గ్రామంలో కష్టపడి పనిచేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. తప్పుడు మస్తర్లు వేయడంతో ఆ గ్రూపుల్లో పనిచేసేవారికి తక్కువ వేతనం అందే అవకాశాలుండటం గమనార్హం.
– 2014–15సంవత్సరంలో పెద్దింపేట పంచాయతీలో 78 గ్రూపులుండగా 602 జాబ్‌కార్డు హోల్డర్లున్నారు. వీరిలో 1,031మంది వేతనదారులు పనిచేశారు. 49 పనులకు రూ.199.57 లక్షలు మంజూరవగా రూ.40.48 లక్షలు ఖర్చయినట్టు, 2015–16 సంవత్సరంలో 131పనులకు రూ.308.45 లక్షలు మంజూరవగా రూ.69.67 లక్షలు ఖర్చయినట్టు లెక్కలు చూపుతున్నారు.
న్యాయం చేయండి– జనార్దన్, పెద్దింపేట.
వికలాంగ గ్రూపునకు చెందిన మాకు, లక్ష్మి పేరంటాలు గ్రూపులకు డబ్బులు రావలసి ఉంది. జూన్ నెలలో చేసిన ఫారం పాండ్ పనుల బిల్లు సుమారు రూ.25వేల వరకు రావలసి ఉంది. తప్పుడు మస్తర్లు వేసి అక్రమంగా నిధులు స్వాహా చేస్తున్నట్టు గుర్తించి ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదు. కష్టపడి పనిచేసిన వేతనదారులకు అన్యాయం జరగకుండా చూడాలి.
అక్రమాలు రుజువైతే చర్య– విజయలక్ష్మి, ఏపీవో, ఉపాధి హామీ పథకం
తప్పుడు మస్తర్లపై ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేసి అక్రమాలు జరిగినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి పొరపాట్లు చేయవద్దని మేట్లను హెచ్చరిస్తున్నాం.
Advertisement