మే 6న సత్యదేవుని దివ్యకల్యాణం
మే 6న సత్యదేవుని దివ్యకల్యాణం
Published Mon, Mar 20 2017 11:20 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
- 5 నుంచే ప్రారంభం కానున్న ఉత్సవాలు
- ఏర్పాట్లకు రూ.35 లక్షల కేటాయింపు
- కల్యాణ మహోత్సవ సన్నాహక సమావేశంలో పాలక మండలి నిర్ణయం
అన్నవరం : మే నెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ (వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ) జరగనున్న శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. రత్నగిరిపై సోమవారం జరిగిన కల్యాణోత్సవాల సన్నాహక సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్టు చెప్పారు. వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా మే ఆరో తేదీ రాత్రి స్వామివారి దివ్యకల్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు. కల్యాణ మహోత్సవాలకు రూ.35 లక్షల వరకూ ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈసారి దేవస్థానమే సొంతంగా చలువ పందిళ్లు వేయిస్తుందని చెప్పారు. దేవస్థానం వ్యవసాయ భూమిలోని తాటిచెట్ల నుంచి తాటియాకులు సేకరిస్తామన్నారు. వెదురుబొంగులు ఇచ్చేందుకు ఒక దాత ముందుకు వచ్చారని తెలిపారు.
వచ్చే ఏడాది ఉత్సవాలకు కొత్త వాహనాలు
సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో స్వామి, అమ్మవార్లను ఐదు రోజులపాటు ఊరేగించే వివిధ వాహనాలు పాతబడినందున వాటి స్థానంలో కొత్తవి తయారు చేయించాలని నిర్ణయించినట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. కొత్త వాహనాల తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది జరిగే కల్యాణ మహోత్సవాలకు మాత్రమే ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.
సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో మొదటి రోజున పెళ్లిపెద్దలు సీతారాములను, వధూవరులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను వేర్వేరుగా వాహనాల్లో ఊరేగిస్తారు. స్వామివారి కల్యాణం రోజున స్వామి, అమ్మవార్లను విడివిడిగా ఊరేగిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి, అమ్మవార్లను ఒకే వాహనంలో ఊరేగిస్తారు. ఇందుకోసం దేవస్థానం వద్ద వెండి రథ వాహనం, ఆంజనేయ వాహనం, గజ వాహనం, గరుడ వాహనం, కొయ్యతో చేసిన రావణబ్రహ్మ వాహనం, పొన్నచెట్టు వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ పాతబడడంతో ఊరేగింపు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికితోడు దేవస్థానానికి పెద్ద రథం కూడా లేదు. రథంతోపాటు కొత్త వాహనాల తయారీకి దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ వాహనాలను తయారు చేయించే బాధ్యతను వేదపండితులు, ప్రధానార్చకులు, స్పెషల్‌గ్రేడ్ వ్రత పురోహిæతులతో కూడిన దేవస్థానం వైదిక కమిటీకి, పీఆర్‌ఓ తులా రాముకు అప్పగించినట్లు తెలిపారు.
సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటుకు యోచన
సత్యదేవుని సన్నిధికి వచ్చే భక్తుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు చేసేందుకు పండితులతో చర్చిస్తున్నట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. తొలుత స్వామివారి జన్మనక్షత్రం మఖనాడు ఈ సేవ ఏర్పాటు చేస్తామని, భక్తుల స్పందననుబట్టి వారంలో ఒక రోజు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. కల్యాణ మహోత్సవ సన్నాహక సమావేశంలో పీఆర్‌ఓ తులా రాము, సూపరింటెండెంట్ బలువు సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement