satyanarayanaswamy
-
ఢిల్లీలో సత్యదేవుని సామూహిక వ్రతాలు
బిర్లామందిర్ టీటీడీ కల్యాణమండపంలో నిర్వహణ పెద్ద సంఖ్యలో వ్రతాలాచరించిన ప్రవాసాంధ్రులు యాతం గంగారావు అండ్ బాలరాజు ఛారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఆదివారం కూడా కొనసాగనున్న వ్రతాల నిర్వహణ అన్నవరం: రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని వైభవాన్ని ఇతర ప్రాంతాల్లో చాటిచెప్పే చర్యల్లో భాగంగా అన్నవరం దేవస్థానం ఇతర రాష్ట్రాలలో సత్యదేవుని సామూహిక వ్రతాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా శనివారం దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బిర్లామందిర్‌లో సత్యదేవుని సామూహిక వ్రతాలను నిర్వహించారు. ఈ వ్రతాలను యాతం గంగారావు అండ్ బాలరాజు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహించారు. యాతం గంగారావు అండ్ బాలరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అభ్యర్థన మేరకు అన్నవరం పండితులు వ్రతసామగ్రి, సత్యదేవుని రాగి మాడాలను, నమూనా విగ్రహాలను తీసకుని ఢిల్లీ వెళ్లి ఈ వ్రతాలు నిర్వహించారు. 200 వ్రతాల నిర్వహణ బిర్లామందిర్ టీటీడీ కల్యాణమండపంలో శనివారం ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి అన్నవరం స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు ముత్య సత్యనారాయణ, ఆకొండి వ్యాసమూర్తి, కర్రి వైకుంఠరావు తదితర పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. 7.30 గంటలకు స్వామివారి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. వ్రతాల అనంతరం సత్యదేవుని ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఉదయం7.30, 10.30 గంటలకు రెండు బ్యాచ్‌లుగా ఈ వ్రతాలను నిర్వహించారు. మొత్తం 200 జంటలు స్వామివారి వ్రతాలు ఆచరించాయని, ఢిల్లీలో స్థిరపడిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించి తీర్దప్రసాదాలను స్వీకరించినట్టు దేవస్థానం సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు. వ్రతాలకు హాజరైన ఎయిర్‌మార్షల్స్ ఢిల్లీలో జరిగిన సత్యదేవుని వ్రతాల కార్యక్రమంలో ఎయిర్‌మార్షల్స్ పి. సుభాష్ బాబు , రవీంద్రనాథ్ పాల్గొన్నారు. వారికి కల్యాణ మండపం వద్ద యాతం గంగారావు ఆధ్వర్యంలో అన్నవరం పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సత్యదేవుని వ్రతాల నిర్వహణ ఇది రెండోసారి: గంగారావు ఢిల్లీలో తమ ట్రస్ట్ తరఫున సత్యదేవుని వ్రతాలు నిర్వహించడం ఇది రెండో సారి అని యాతం గంగారావు శనివారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్లో ‘సాక్షి’ కి తెలిపారు. 2011లో ఒకసారి ఈ వ్రతాలు నిర్వహించామని తెలిపారు. అభ్యర్ధించిన వెంటనే సత్యదేవుని వ్రతాల నిర్వహణకు పండితులను పంపించిన దేవస్థానం చైర్మన్, ఈఓలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు ప్రియం
నుంచి టిక్కెట్ల ధర పెంపు - 30 శాతం పెరగనున్న వ్రత ఆదాయం - ఈఓ నాగేశ్వరరావు వెల్లడి అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో వ్రత నిర్వహణ భక్తులకు ప్రియం కానుంది. రూ.150, రూ.300, రూ.700 వ్రతాల టిక్కెట్ల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 15 శాతం నుంచి 33 శాతం వరకూ పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం పెరిగినందున వ్రతాల టిక్కెట్ల ధరలు పెంచాలని దేవస్థానం పాలకవర్గం గతంలోనే నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ వైవీ అనూరాధ మంగళవారం ఆమోదించారని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. విజయవాడలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను మంగళవారం కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. పెంపు ఇలా.. రూ.150 వ్రత టిక్కెట్ రూ.200కు, రూ.300 టిక్కెట్‌ను రూ.400కు, రూ.700 టిక్కెట్‌ను రూ.800కి పెంచుతున్నారు. అయితే రూ.1,500, ఏసీ మండపంలో నిర్వహించే రూ.2 వేల వ్రత టిక్కెట్ల ధరలను పెంచడం లేదని ఈఓ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్రతాల ద్వారా సుమారు రూ.23.70 కోట్ల ఆదాయం వచ్చింది. వ్రతాల టిక్కెట్ల పెంపు ద్వారా 30 శాతం అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్రత విభాగం ద్వారా రూ.27 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే టిక్కెట్ల ధరలను పెంచడంవలన ఈ ఆదాయం రూ.30 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీంతోపాటు వ్రత పురోహితులకు దేవస్థానం చెల్లించే పారితోషికం కూడా పెరగనుంది. ప్రసాదం బరువు, ధర పెంపు సత్యదేవుని ప్రసాదం ధరను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం వంద గ్రాముల ప్రసాదం రూ.10కి విక్రయిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్యాకెట్ బరువును 125 గ్రాములకు పెంచి రూ.15కి విక్రయించనున్నట్టు ఈఓ తెలిపారు. ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులు గోధుమ, పంచదార, నెయ్యి, యాలకులతోపాటు వంటగ్యాస్ ధర కూడా పెరగడంతో తయారీ వ్యయం భారీగా పెరిగిందన్నారు. వాస్తవానికి బరువు 25 గ్రాములు పెంచినందున దాని ప్రకారం ధర రూ.2.50 పెరుగుతుందని, కానీ ప్రసాదం తయారీలో వస్తున్న నష్టాన్ని అధిగమించేందుకు, చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు మరో రూ.2.50 కలిపి రూ.15కి విక్రయించాలని నిర్ణయించినట్టు ఈఓ తెలిపారు. 2016-17లో ప్రసాదం విక్రయాల ద్వారా దేవస్థానానికి రూ.19.61 కోట్ల ఆదాయం రాగా, 2017-18లో రూ.21.50 కోట్లు వస్తుందని అంచనా వేశారు. తాజా పెంపుదల కారణంగా ఈ ఆదాయం రూ.24 కోట్లు ఉండగలదని అంచనా వేస్తున్నారు. -
మే 6న సత్యదేవుని దివ్యకల్యాణం
- 5 నుంచే ప్రారంభం కానున్న ఉత్సవాలు - ఏర్పాట్లకు రూ.35 లక్షల కేటాయింపు - కల్యాణ మహోత్సవ సన్నాహక సమావేశంలో పాలక మండలి నిర్ణయం అన్నవరం : మే నెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ (వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ) జరగనున్న శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. రత్నగిరిపై సోమవారం జరిగిన కల్యాణోత్సవాల సన్నాహక సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్టు చెప్పారు. వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా మే ఆరో తేదీ రాత్రి స్వామివారి దివ్యకల్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు. కల్యాణ మహోత్సవాలకు రూ.35 లక్షల వరకూ ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈసారి దేవస్థానమే సొంతంగా చలువ పందిళ్లు వేయిస్తుందని చెప్పారు. దేవస్థానం వ్యవసాయ భూమిలోని తాటిచెట్ల నుంచి తాటియాకులు సేకరిస్తామన్నారు. వెదురుబొంగులు ఇచ్చేందుకు ఒక దాత ముందుకు వచ్చారని తెలిపారు. వచ్చే ఏడాది ఉత్సవాలకు కొత్త వాహనాలు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో స్వామి, అమ్మవార్లను ఐదు రోజులపాటు ఊరేగించే వివిధ వాహనాలు పాతబడినందున వాటి స్థానంలో కొత్తవి తయారు చేయించాలని నిర్ణయించినట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. కొత్త వాహనాల తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది జరిగే కల్యాణ మహోత్సవాలకు మాత్రమే ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో మొదటి రోజున పెళ్లిపెద్దలు సీతారాములను, వధూవరులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను వేర్వేరుగా వాహనాల్లో ఊరేగిస్తారు. స్వామివారి కల్యాణం రోజున స్వామి, అమ్మవార్లను విడివిడిగా ఊరేగిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి, అమ్మవార్లను ఒకే వాహనంలో ఊరేగిస్తారు. ఇందుకోసం దేవస్థానం వద్ద వెండి రథ వాహనం, ఆంజనేయ వాహనం, గజ వాహనం, గరుడ వాహనం, కొయ్యతో చేసిన రావణబ్రహ్మ వాహనం, పొన్నచెట్టు వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ పాతబడడంతో ఊరేగింపు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికితోడు దేవస్థానానికి పెద్ద రథం కూడా లేదు. రథంతోపాటు కొత్త వాహనాల తయారీకి దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ వాహనాలను తయారు చేయించే బాధ్యతను వేదపండితులు, ప్రధానార్చకులు, స్పెషల్‌గ్రేడ్ వ్రత పురోహిæతులతో కూడిన దేవస్థానం వైదిక కమిటీకి, పీఆర్ఓ తులా రాముకు అప్పగించినట్లు తెలిపారు. సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటుకు యోచన సత్యదేవుని సన్నిధికి వచ్చే భక్తుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు చేసేందుకు పండితులతో చర్చిస్తున్నట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. తొలుత స్వామివారి జన్మనక్షత్రం మఖనాడు ఈ సేవ ఏర్పాటు చేస్తామని, భక్తుల స్పందననుబట్టి వారంలో ఒక రోజు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. కల్యాణ మహోత్సవ సన్నాహక సమావేశంలో పీఆర్ఓ తులా రాము, సూపరింటెండెంట్ బలువు సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.