ఢిల్లీలో సత్యదేవుని సామూహిక వ్రతాలు
ఢిల్లీలో సత్యదేవుని సామూహిక వ్రతాలు
Published Sat, Apr 22 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
బిర్లామందిర్ టీటీడీ కల్యాణమండపంలో నిర్వహణ
పెద్ద సంఖ్యలో వ్రతాలాచరించిన ప్రవాసాంధ్రులు
యాతం గంగారావు అండ్ బాలరాజు ఛారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఆదివారం కూడా కొనసాగనున్న వ్రతాల నిర్వహణ
అన్నవరం: రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని వైభవాన్ని ఇతర ప్రాంతాల్లో చాటిచెప్పే చర్యల్లో భాగంగా అన్నవరం దేవస్థానం ఇతర రాష్ట్రాలలో సత్యదేవుని సామూహిక వ్రతాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా శనివారం దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బిర్లామందిర్‌లో సత్యదేవుని సామూహిక వ్రతాలను నిర్వహించారు. ఈ వ్రతాలను యాతం గంగారావు అండ్ బాలరాజు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహించారు. యాతం గంగారావు అండ్ బాలరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అభ్యర్థన మేరకు అన్నవరం పండితులు వ్రతసామగ్రి, సత్యదేవుని రాగి మాడాలను, నమూనా విగ్రహాలను తీసకుని ఢిల్లీ వెళ్లి ఈ వ్రతాలు నిర్వహించారు.
200 వ్రతాల నిర్వహణ
బిర్లామందిర్ టీటీడీ కల్యాణమండపంలో శనివారం ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి అన్నవరం స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు ముత్య సత్యనారాయణ, ఆకొండి వ్యాసమూర్తి, కర్రి వైకుంఠరావు తదితర పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. 7.30 గంటలకు స్వామివారి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. వ్రతాల అనంతరం సత్యదేవుని ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఉదయం7.30, 10.30 గంటలకు రెండు బ్యాచ్‌లుగా ఈ వ్రతాలను నిర్వహించారు. మొత్తం 200 జంటలు స్వామివారి వ్రతాలు ఆచరించాయని, ఢిల్లీలో స్థిరపడిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించి తీర్దప్రసాదాలను స్వీకరించినట్టు దేవస్థానం సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు.
వ్రతాలకు హాజరైన ఎయిర్‌మార్షల్స్
ఢిల్లీలో జరిగిన సత్యదేవుని వ్రతాల కార్యక్రమంలో ఎయిర్‌మార్షల్స్ పి. సుభాష్ బాబు , రవీంద్రనాథ్ పాల్గొన్నారు. వారికి కల్యాణ మండపం వద్ద యాతం గంగారావు ఆధ్వర్యంలో అన్నవరం పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
సత్యదేవుని వ్రతాల నిర్వహణ ఇది రెండోసారి: గంగారావు
ఢిల్లీలో తమ ట్రస్ట్ తరఫున సత్యదేవుని వ్రతాలు నిర్వహించడం ఇది రెండో సారి అని యాతం గంగారావు శనివారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్‌లో ‘సాక్షి’ కి తెలిపారు. 2011లో ఒకసారి ఈ వ్రతాలు నిర్వహించామని తెలిపారు. అభ్యర్ధించిన వెంటనే సత్యదేవుని వ్రతాల నిర్వహణకు పండితులను పంపించిన దేవస్థానం చైర్మన్, ఈఓలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement