9న విశాఖలో ఫలితాలు విడుదల
కన్వీనర్ సాయిబాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు(ఎంసెట్)కు సంబంధించి ప్రాథమిక కీపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ఈ నెల 6న నిపుణుల కమిటీని సమావేశపర్చాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ప్రాథమిక కీపై ఇప్పటివరకు 12 అభ్యంతరాలు రాగా అందులో ఎక్కువ మెడికల్ విభాగానికి సంబంధించినవే. రానున్న రెండురోజుల్లో మరిన్ని అభ్యంతరాలు వచ్చే అవకాశాలున్నాయి. వీటన్నిటినీ నిపుణుల కమిటీ ముందుం చనున్నామని, వారిచ్చే సూచనలను అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఈనెల 9న ఫైనల్ కీ, ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ ఫలితాలను విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారని వివరించారు.
మెడికల్‌లో 23వ ప్రశ్నను డిలీట్ చేయాలి
ఇలా ఉండగా ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రంలోని 23వ ప్రశ్నలో ఒక పదం ఇంగ్లిష్ వెర్షన్లో ఒకరకంగా, తెలుగు వెర్షన్లో మరో రకంగానూ ఇచ్చారని, దీనివల్ల విద్యార్థులు సరైన సమాధానాన్ని గుర్తించడంలో సందిగ్ధతకు లోనయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ఎంసెట్ కన్వీనర్‌కు నివేదించారు. ఆ ప్రశ్నలో ఒక పదం 'nucleolides' అని ఇంగ్లిష్‌లో ఉండగా అదే ప్రశ్నను తెలుగు అనువాదంలో 'nucleotides' అని ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారని, కొంతమందికి నష్టం కలుగుతోందని వివరించారు. ఈ ప్రశ్నను తొలగించి ర్యాంకులు ప్రకటించాలని కన్వీనర్‌ను కోరారు.
ఏపీ ఎంసెట్ కీ అభ్యంతరాలపై 6న నిపుణుల కమిటీ భేటీ
Published Tue, May 3 2016 2:12 AM | Last Updated on Sat, Mar 23 2019 8:55 PM
Advertisement
Advertisement