రబీకి నీరందేనా!
రబీకి నీరందేనా!
Published Tue, Nov 29 2016 10:44 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
-గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీలో 24,372 ఎకరాల ఆయకట్టు
– అధికారుల ప్రకటనలతో పంటలు వేసిన రైతులు
– ఈ మొత్తానికి నీరు ఇవ్వాలంటే 2.5 టీఎంసీల నీరు అవసరం
– అందుబాటులో ఉండేది...1.7 టీఎంసీలు మాత్రమే
– నీటి విడుదలపై స్పష్టత ఇవ్వని ఇంజినీర్లు
కర్నూలు సిటీ: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) కింద కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, కృష్ణగిరి మండలాలకు చెందిన 24,372 ఎకరాలకు సాగునీరు, 21 గ్రామాలకు తాగు నీరు అందించాలని లక్ష్యం. 4.5 టీఎంసీల సామర్థ్యంలో 1987లో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో ఆయకట్టు లేదు. రబీలో మాత్రమే సాగుకు నీరు ఇవ్వాలి. అయితే, ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం, అధికారుల అవగహన రాహిత్యంతో సాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాగునీటి జలాశయాన్ని కాస్త సమ్మర్ స్టోరేజీ ట్యాంకులా మార్చేశారు.
అధికారపార్టీనేతలకు తలొగ్గి ఇష్టారాజ్యంగా నీటి విడుదల
ఈ ఏడాది జీడీపీకి గతంలో ఎప్పుడు కూడా లేనంతా నీరు వచ్చింది. అయితే తుంగభద్ర దిగువ కాలువ నీరు చివరి ఆయకట్టుకు రాకపోవడం, వర్షాలు లేకపోవడంతో పంటలకు నీరు ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు వారు అడగ్గానే కాదనకుండా నీరు ఇచ్చారు. ఈ నీటితో అధికార పార్టీ నేతలు వ్యాపారం చేసి లక్షల్లో మామూళ్లు వసూళ్లు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టుకు సైతం నీరు ఇచ్చినట్లు కొందరు రైతులు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రబీకి నీరు అందేనా?
ఈ నెల మొదటి వారంలో జీడీపీ ప్రాజెక్టు కమిటీ, రైతులతో జరిగిన సమావేశంలో ఇంజినీర్లు రబీలో ఆరుతడి పంటలకు మాత్రమే నీరు ఇస్తామని మాటిచ్చారు. దీంతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేతల కాసుల దాహానికి ప్రాజెక్టు నీరంతా ఆవిరి అయినట్లు తెలుస్తోంది. అయితే, రబీకి నీరు ఇస్తామని అధికారులు ముందే చెప్పడంతో ఇప్పుడు వారు ఇరకాటంలో పడ్డారు. జీడీపీ నుంచి తాగుకు నీరు వాడుకుంటున్నందుకు ప్రత్యామ్నయంగా పందికొన నుంచి హంద్రీనీవా నీరు జీడీపీకి రోజుకు 200 క్యుసెక్కుల చొప్పున వదులుతున్నారు. కానీ ప్రాజెక్టులోకి ఈ నెల 3 నుంచి వదిలిన నీరు 200 ఎంసీఎఫ్‌టీ మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
జీడీపీలో అరకొర నీరు
24,372 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే కనీసం 2.5 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 1.7 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీటిని వచ్చే ఏడాది జూలై వరకు తాగడానికి ఇచ్చేందుకే సరిపోదు. ఇలాంటి సమయంలో ఆయకట్టుకు నీరు ఎక్కడి నుంచి ఇస్తారో అర్థం కానీ పరిస్థితి. అయితే, అధికారులు మాత్రం 24,372 ఎకరాల ఆయకట్టులో సాధారణంగా 17,400 ఎకరాలకే నీరు ఇచ్చేదని, ఇందులో ఖరీఫ్‌లోని 13 వేల ఎకరాలకు నీరు ఇచ్చామని చెబుతున్నారు. ఇక మిగిలిన 4,400 ఎకరాలకు మాత్రమే రబీలో నీరు ఇస్తామని, అది కూడా పత్తికి ఒక తడి నీరు ఇస్తే సరిపోతుందని అధికారులు తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి అధికారులు ముందుగా చేసిన ప్రకటనతో కుడి కాలువ కింద రబీ పంటలు సాగు చేశారు. ఇప్పుడు అధికారుల వ్యవహార తీరు ఆయకట్టుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
నీటి నిల్వ తక్కువగా ఉంది
గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్ ఆయకట్టు లేదు. అయితే వర్షాలు కురవక పోవడం, ఎల్‌ఎల్‌సీ నీరు చివరి ఆయకట్టుకు నీరు రాకపోవడంతో ఎండుతున్న పంటలను కాపాడేందుకు జీడీపీ నీరు ఇచ్చాం. మొత్తం ఆయకట్టులో ఖరీఫ్‌లో 6 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వలేదు. రబీ కింద ఈ ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు సాధ్యమవుతుందా లేదా అనేది పరిశీలిస్తున్నాం. కలెక్టర్ సైతం ఖరీఫ్‌లో నీరు ఇవ్వని ఆయకట్టుకు మాత్రమే నీరు ఇవ్వాలని సూచించారు.
– చంద్రశేఖర్ రావు, ఎస్‌ఈ జల వనరుల శాఖ
Advertisement
Advertisement