‘ఈ–పేపర్’ దుమారం!
-
పేపర్ నిర్వహణకు నెలకు రూ.2 లక్షలు ఖర్చు
-
మేయర్ అనుచరుడికి రూ.50 వేల జీతం
-
మేయర్ తీరుపై విమర్శల వెల్లువ
-
నేడు స్టాండింగ్ కమిటీలో ఆమోదానికి రంగం సిద్ధం
కార్పొరేషన్ దోపిడీకి నయా దోపిడీకి రంగం సిద్ధమైంది.. పక్ష పత్రిక, ‘ఈ–పేపర్’, ‘ఈ–న్యూస్’ వెబ్‌సైట్ల నిర్వహణకు నెలకు రూ.2లక్షలు, వాటి పర్యవేక్షకుడికి(మేయర్ అనుచుడికి) నెలకు రూ.50 వేల వేతనం ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. నేడు జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యవహారంలో మేయర్ అజీజ్ మరో అవినీతి, అక్రమాలకు పూనుకున్నారని ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ, స్వపక్ష పార్టీ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెల్లూరు, సిటీ:
అబ్దుల్ అజీజ్ మేయర్ కాకముందు నుంచే కొన్నేళ్లుగా రఫీ అనే వ్యక్తి అతని వద్ద జీతానికి పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సంస్థను ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా రఫీ కొనసాగుతున్నారు. అయితే గత నెలలో ఓ పత్రికలో ఎడిటర్, కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో కేవలం ఇద్దరు వ్యక్తులు ఎడిటర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోగా, వారిలో మేయర్ వర్గానికి చెందిన రఫీని ఎడిటర్‌గా నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. నేడు(సోమవారం) జరగనున్న స్టాండింగ్ కమిటీలో రఫీ పేరును పొందుపరిచి ఆమోదించనున్నారు. అయితే పత్రికా ఎడిటర్‌కు రూ.50 వేలు జీతం చెల్లించడం విమర్శలకు తావిస్తోంది. ఆయన కింద పనిచేసే నలుగురు అసిస్టెంట్‌లకు ఒక్కొక్కరికి రూ.18 వేలు చొప్పున చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే జీతాల రూపేణా మొత్తం రూ.1.22 లక్షలు ఖర్చుచేస్తుండటం గమనార్హం.
పేపర్ నిర్వహణకు రూ.2లక్షలు
‘ఈ–పేపర్’ నిర్వహణకు నెలకు రూ.2 లక్షలు ఖర్చు కానుంది. అదే విధంగా నగర పాలక సంస్థ పరిధిలో డివైడర్లకు మధ్యలో రూ.కోటి రూపాయలతో మొక్కలు నాటేందుకు స్టాండింగ్ కమిటీ అజెండాలో పొందుపరిచారు. ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
స్టాండింగ్ కమిటీ సభ్యులకు ముందస్తు హెచ్చరిక
గతంలో కొన్ని అంశాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలో సభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఆ అంశాలను మేయర్ అజీజ్ రద్దు చేయకతప్పలేదు. మరోసారి పునరావృతం కాకుండా మేయర్ అజీజ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్టాండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి తాను పొందుపరిచిన అంశాలకు అడ్డుచెప్పకుండా ఆమోదం తెలపాలని, వ్యతిరేకిస్తే పార్టీ ధిక్కారం కిందకు వస్తుందని సభ్యులకు హెచ్చరించినట్లు సమాచారం.