మానవపాడు: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కిరాణ దుకాణానికి గిరాకీ లేక, అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడుకు చెందిన జయకృష్ణయ్య శెట్టి (39) సొంత గ్రామం కర్నూల్ జిల్లా వెల్దూర్తి మండలం రామళ్లకోట. 14 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమ్తితం మానవపాడు గ్రామానికి వచ్చారు. స్థానిక ఎస్సీకాలనీలో కిరాణం షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. పెద్దనోట్ల రద్దుతో కిరాణ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. షాపుపై చేసిన అప్పులు అధికం కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం భార్య లక్ష్మీదేవి తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది.
ఈ క్రమంలో జయకృష్ణయ్యశెట్టి మంగళవారం రాత్రి ఇంట్లోనే చీరతో ఉరివేసుకున్నాడు. బుధవారం దుకాణానికి వెళ్లిన స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఏఎస్‌ఐ రామచందర్‌జీ చేరుకొని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. రూ.రెండు లక్షల వరకు అప్పులు ఉన్నాయని, నెలరోజులుగా కిరాణదుకాణానికి గిరాకీ తగ్గిందని, ఎలా బతకాలి... పిల్లలను ఎలా చదవించుకోవాలం టూ పదేపదే చెప్పేవాడని భార్య లక్ష్మీదేవి రోదిస్తూ చెప్పింది.
నోట్ల రద్దుతో గిరాకీ లేక వ్యాపారి ఆత్మహత్య
Published Thu, Dec 22 2016 4:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
Advertisement