మధ్యాహ్నం..స్పందన అధ్వానం! | mid day meal drought for students | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం..స్పందన అధ్వానం!

Published Thu, Apr 21 2016 1:54 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మధ్యాహ్నం..స్పందన అధ్వానం! - Sakshi

మధ్యాహ్నం..స్పందన అధ్వానం!

కరువు నేపథ్యంలో సర్కారు బడిపిల్లలకు సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం  అందించాలనుకున్న ప్రభుత్వ ఆశయం తొలిరోజే నీరుగారింది. విద్యాశాఖ అంచనాల కంటే అతి తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 2,062 ప్రభుత్వ పాఠశాలల్లోని 80,329 మంది విద్యార్థులు భోజనం చేస్తారని అంచనా వేశారు. కానీ తొలిరోజైన బుధవారం కేవలం 42శాతం మందే హాజరయ్యారు.  
  
  - సాక్షి, రంగారెడ్డి జిల్లా

14 పాఠశాలల్లో విద్యార్థులు నిల్
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలంలో 71 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా కేవలం 57 పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. 7200 మంది విద్యార్థులకు కేవలం 1219 మంది మాత్రమే భోజనం చేశారు. పెద్దషాపూర్, పెద్దతూప్ర, మల్కా రం, ఇనాంషేరి, ఊట్‌పల్లి, కేఎల్.చారినగర్, బుర్జుగడ్డతండా తదితర గ్రామాల్లో విద్యార్థులు లేక భోజనం వండలేదు. 

తాళాలు కూడా తీయలేదు
చేవెళ్లరూరల్ : ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా చేవెళ్ల మండలంలో వేసవి ప్రత్యేక మధ్యాహ్న భోజన పథకం బుధవారం పూర్తిస్థాయిలో కాలేదు. తొలి రోజు చాలా పాఠశాలలకు తాళాలు కూడా తీయలేదు. మండలంలో 63 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా 510 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా వీరిలో 50శాతం మంది వేసవి మధ్యాహ్న భోజన పథకానికి హాజరవుతారని అధికారులు అంఛనా వేశారు. కానీ కేవలం 400 మంది మాత్రమే భోజనం చేశారు. 30 పాఠశాలల్లో నామమాత్రంగా అమలు కాగా 33 పాఠశాలలు అసలు తెరచుకోలేదు. కొన్ని పాఠశాలల్లో బియ్యం లేకపోవడంతో మధ్యాహ్న భోజనం పెట్టలేక పోయామని అధికారులు పేర్కొన్నారు.

దండోరా వేయించాం..
వేసవి సెలవుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు గ్రామాల్లో ఇప్పటికే దండోరా వేయించాం. అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా సమాచారం అందించాం. తోటి విద్యార్థులకు తెలిసేలా చర్యలు తీసుకుంటున్నాం. మొదటి రోజు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంది.     - రాంరెడ్డి, ఎంఈఓ, శంషాబాద్

588 మందికే భోజనం
ఇబ్రహీంపట్నం రూరల్ : ఇబ్రహీంపట్నం మండల పరిధిలో 50 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా 5485 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో వేసవి ప్రత్యేక మధ్యాహ్న భోజనానికి 1,777 మంది వస్తారని అధికారులు గుర్తించారు. కానీ బుధవారం మండల వ్యాప్తంగా 588 మంది మాత్రమే భోజనం చేశారు. 24 పాఠశాలల్లో నామమాత్రంగా భోజనం చేయగా 26 పాఠశాలల్లో తలుపులు కూడా తెరవేదు.

ఆసక్తి చూపని విద్యార్థులు
ధారూరు : మండలంలోని 62 ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం వేసవి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. 4,952 మంది విద్యార్థులకు 1032 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేశారు. సమీప గ్రామాల విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో సంఖ్య తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. గోదంగుడ, సర్పన్‌పల్లి, మోమిన్‌కలాన్ గ్రామాల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈఓ బాబుసింగ్ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement