ఇంకా పెళ్లీడు రాని కూతురి పెళ్లి చేయడానికి తొందరపడుతున్న తల్లిదండ్రులు బాలవ్వ, చంద్రయ్య
ఉన్న ఊళ్లో పెళ్లయినా ఊరివాళ్లందరూ వేరే ఊళ్ల నుంచి రావాల్సిందే. కరువుకు ఎవరు ఎక్కడ వలసకెళ్లారో మరి. సేద్యం సరిగా లేదు... ఇంటికి మగదిక్కు లేదు... ఎదుగుతున్న ఆడపిల్లకు రక్షణ లేదు... అన్నింటికీ విరుగుడు పెళ్లి. మెతుకు సీమగా వాసికెక్కిన మెదక్ జిల్లాలో ఈ రెండేళ్ల కాలంలో దాదాపు 1000 బాల్య వివాహాలు జరిగాయని అంచనా. కొన్ని అధికారుల ప్రమేయంతో ఆగిపోయాయి. ఆగిన పెళ్లిళ్లను పలకరిస్తే జరిగిన పెళ్లిళ్ల కారణాలు కూడా తెలుస్తాయి. విద్య, ఉపాధి కల్పించి వలస నిరోధం చేసి తగిన చైతన్యం కల్పించడమే దీనికి విరుగుడుగా అర్థమవుతుంది.
కట్నానికి బదులుగా చెల్లెలు...
కరువుకు తోడు పరిస్థితులు కూడా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. అల్లాదుర్గం- ముస్లాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు మంజూల, మల్లేశం దంపతుల పెద్దమ్మయి పుట్టుకతోనే వికలాంగురాలు. కుడి చేయి, ఎడమ కాలు పని చేయవు. ఆ అమ్మాయి తరువాత మరో అమ్మాయి ఉంది. మల్లేశం పంటలు పండక పోవడంతో సంగారెడ్డిలో కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వికలాంగురాలైన కూతురు వివాహానికి వరుడెవరూ ముందుకు రావడం లేదని ‘పెద్దమ్మాయిని చేసుకుంటే చిన్నమ్మాయిని కూడా ఇస్తాం’ అనే ఆఫర్‌తో ఒప్పించారు.
ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్లే. చిన్నమ్మాయి 10వ తరగతి పాస్ అయింది. అక్క పెళ్లికి కట్నంగా తనను ఇచ్చారని పెళ్లి రోజు వరకూ తెలియని ఆ అమ్మాయి పెళ్లినాడు ‘నన్ను వదిలేయండి అమ్మా... నేను చదువుకుంటాను’ అని ఎంత వేడుకున్నా ఆ మాటలు బంధువుల్ని, తల్లిదండ్రులను కదిలించలేకపోయాయి. అదృష్టం కొద్ది అధికారులు వచ్చి పెళ్లిని నిలవరించారు.
అమ్మ బాధలు ఇప్పు కూతురికి ....
ధరావత్ అరుణది టేక్మాల్ మండలం చెరువు ముందరి తండా. 12 ఏళ్ల వయసులో తండ్రి గోపాల్ అనే అబ్బాయిని తీసుకొచ్చి ‘వీడు నీ మొగడు బిడ్డా.. సంసారం చేసుకో’ అని పెళ్లి చేశాడు. ఏడాది గడవక ముందే తల్లి అయ్యింది. ఆమే చిన్న పిల్ల. ఇప్పుడు మెడకు ఇద్దరు పిల్లలు. ఓ రోజు పొలానికి నీళ్లు పారబెట్టేందుకు వెళ్ళిన భర్త గోపాల్ కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయాడు. ఇప్పుడు పనులు చేసేందుకు మగ తోడు లేదు. మగదిక్కు కోసం అన్న కొడుకునే తనకు అల్లుడు చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఆ ప్రయత్నాన్ని అధికారుల ఆపేశారు. కాని ఆమె ప్రయత్నం ఆపేలా లేదు.
భర్త చనిపోతాడని...
కాస్తి బాలవ్వది రాజక్క పేట. ఆమె భర్త చంద్రయ్యకు గుండెనొప్పి ఉంది. భర్త చనిపోయేలోపే కూతురి పెళ్లి చేయాలని ప్రయత్నించింది. పెండ్లీడు వయసుకు మూడు నెలలు తక్కువగా ఉందని అధికారులొచ్చి ఆపేశారు. బిడ్డ పెళ్లికి రూ.3 లక్షల అప్పు చేసింది. ఇప్పుడు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతోంది.
అల్లుడి కోసం ఆరాటం...
బాగయ్యది డాకూర్ గ్రామం. చెల్లెలి కొడుకును 8 ఏళ్ల వయసు నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అతణ్ణే అల్లుణ్ణి చేసుకుంటానని చెల్లెలికి మాట ఇచ్చాడు. అయితే కూతురు ఇంకా తగిన వయసుకు రాలేదని ఆలస్యం చేస్తుంటే కుర్రాడు అలిగి సొంత ఊరుకు పారిపోతున్నాడు. పెళ్లికి తొందర పడుతున్న కుర్రాడి కోసం పెళ్లి చేద్దామనుకుంటే అధికారులు సంగతి తెలిసి ఆపేశారు. బాగయ్య మాత్రం ఈ సమస్యకు సమాధానం తెలీక సతమతమవుతున్నాడు.
మా చెల్లెండ్లకు కూడా...
తూప్రాన్ మండలం తాతపాపన్‌పల్లికి చెందిన ఎక్కాల్‌దేవ్ శ్రీనివాస్‌యాదవ్, కోమురమ్మ దంపతులు గత నెలలో కూతురి పెళ్లి చేద్దామనుకుంటే బాల్య వివాహమని పోలీసులు ఆపేశారు. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కొడుకులు. మేకలు, గొర్రెలే బతుకు దెరువు. జీవాలను అమ్ముకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ‘మా పెద్దపిల్లకు మంచి సంబంధమొచ్చింది. ఇంటికి వచ్చిన సంబంధం కాదనలేకపోయాం.
నా ముగ్గురు చెల్లెండ్ల పెండ్లిళ్లు 12 ఏళ్లు ఉన్నప్పుడే చేశాము. వారు పిల్లలు కనలేదా సంసారం చేసుకోవడంలేదా. పీటల మీద పెళ్లిని ఆపేశారు. చుట్టాల ముందు, కులం ముందు పరువు పోయింది. వండిన అన్నమంతా గుమ్మరించాం. అధికారులు ఇలా చేయడం ఏమైన మంచిగుందా?’ అని అతడు ప్రశ్నించాడు.
- వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, మెదక్
పేదరికంతోనే...
పేదరికం, ఆచార వ్యవహారాలు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. భవిష్యత్తు మీద అవగాహం లేని కుటుంబాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాల్య వివాహ చట్టాల మీద ప్రజలకు అవగాహన లేకపోవటం మరో కారణం. ప్రభుత్వ శాఖలు అన్ని సమన్వయంతో ముందుకు పోతే బాల్య వివాహాలను నిర్మూలించవచ్చు.
- యాస్మిన్ బాషా, ఇంఛార్జి పీడీ, ఐసీడీఎస్
ఆడపిల్ల పట్ల వివక్షే కారణం
పురుషాధిక్య సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షే బాల్య వివాహాలకు కారణం. ఎంత సేపటికి అబ్బాయి కంటే అమ్మాయి తక్కువగా ఉండాలనే ఆలోచన. అమ్మాయి చదివితే అంత కంటే ఎక్కువ చదివిన అబ్బాయిని వెతకాలి అబ్బాయి తాహతుకు తగినట్టుగా కట్న కానుకలు ఇవ్వాలనేది ఈ కాలపు తల్లిదండ్రుల్లో బలంగా ఉంది. ఈ ఆలోచనా ధోరణి మారాలి. లైంగిక విద్యను, బాల్య వివాహ చట్టాలను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి.
- శివకుమారి, బాలల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షురాలు
మంచి సంబంధమని పెండ్లి నిశ్చయించాం
పర్వతం లక్ష్మిది దుబ్బాక. బయటకు వెళ్లి కాయకష్టం చేసే కుటుంబం. కూతురు కాకుండా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న కొడుకు ఉన్నాడు. వాణ్ణి చూసుకోవడానికి ఇంట్లో కూతురిని వదిలి పనికి వెళ్లాల్సి వస్తోంది. కూతురి భద్రత కోసం కూతురి వయసు పట్టించుకోకుండా బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుందామె. కూతురు మాత్రం నాకు చదువు కోవాలని ఉంది అంటోంది. ప్రతి రోజూ పాఠశాలకెళ్లి మధ్యాహ్న భోజనం చేసొస్తోంది.