మధ్యాహ్న భోజనం అమలుపై థర్డ్ పార్టీ తనిఖీలు
♦ హోంసైన్స్ కాలేజీ, సెస్, ఎన్‌ఐఎన్, ఎన్‌జీవో ప్రతినిధుల తో బృందం
♦ ఆహార నాణ్యతపైనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం స్థితిగతులపై థర్డ్ పార్టీ తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. భోజనం వండటం నుంచి విద్యార్థులు తినే వరకు వండుతున్న తీరు, నాణ్యత, పాటిస్తున్న పరిశుభ్రత తదితర అన్ని అంశాలపై ప్రత్యేక బృందం నేతృత ్వంలో తనిఖీలు చేపట్టనుంది. హోంసైన్స్ కాలేజీ, సెస్, ఎన్‌ఐఎన్, ఎన్‌జీవో ప్రతినిధుల నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చేపడుతున్న చర్యలు, అమలులో లోపాలు, మెనూ అమలు తదితర అన్ని అంశాలపై థర్డ్ పార్టీ (బృందం) తనిఖీలు చేసి నివేదికలు అందజేయనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తనిఖీలను చేపట్టనుంది. ఆ నివేదిక అధారంగా మధ్యాహ్న భోజనం అమలును మరింత పటిష్టం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.
బిల్లుల చెల్లింపుపైనా కసరత్తు: మధ్యాహ్న భోజనం బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాటి చెల్లింపులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. మూడో క్వార్టర్‌కు సంబంధించిన బిల్లులు ఇంతవరకు మంజూరు కాలేదు. దీనిపై విద్యాశాఖకు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులతోనూ చర్చించారు. మరోవైపు బిల్లుల చెల్లింపు విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బిల్లుల చెల్లింపు విధానాన్ని ఆన్‌లైన్ చేయాలని భావిస్తోంది. విద్యాశాఖ మధ్యాహ్న భోజనం నిధులను ప్రభుత్వం నుంచి ఒకేసారి మంజూరు చేయించుకొని, ఆన్‌లైన్ విధానంలో నేరుగా ఏజెన్సీల అకౌంట్లలో వేసే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే బిల్లులు రాలేదన్న ఆందోళన ఏజెస్సీలకు ఉండదు.