ఇబ్బందుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు
ఇబ్బందుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు
Published Mon, Aug 29 2016 5:51 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
త్రిపురారం : వర్షాకాలం వచ్చిందంటే మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఆరుబయటే వంట చేస్తున్నారు. వానలు వచ్చినప్పుడు కట్టెలు మండకపోవడంతో భోజనాన్ని వండేందుకు అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మహిళలే రేకులు వేసుకుని తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని పాఠశాలల్లో తరగతి గదుల్లో, వరండాల్లో, ఆరుబయట వంటలు చేస్తూ వర్షానికి, గాలికి ఇబ్బందులు పడుతున్నారు. త్రిపురారం మండల వ్యాప్తంగా 5 ఉన్నత, 6 ప్రాథమికోన్నత, 44 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కానీ కేవలం 20 పాఠశాలల్లో మాత్రమే వంటల గదులు ఉన్నాయి. వర్షాకాలం, చలికాలల్లో ఆరుబయట వంటలు చేయడం ఇబ్బందిగా మారుతోందని మహిళలు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో కట్టెలు మండక పొగ తరగతి గదుల్లోకి వ్యాపిస్తుందని విద్యార్థులు పేర్కొంటున్నారు.
గ్యాస్ పొయ్యిలు లేక ఇక్కట్లు..
ఆయా పాఠశాలల్లో వంటగదులు లేకపోవడంతో పరిశుభ్ర వాతావరణంలో చేయాల్సిన బియ్యం కడకడం, కూరగాయల తరగడం లాంటి పనులన్నీ ఆరుబయటే చేయాల్సి వస్తోంది. గాలి దుమారంతో మట్టి, రాళ్లు భోజనంలో పడుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యి మీదే వంటలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో వంటగదులు నిర్మించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.
అన్ని పాఠశాలల్లో గదులు నిర్మించాలి– దైద శ్రీనివాస్, సీపీఎం మండల కన్వీనర్, త్రిపురారం
విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి నిధులు సమకూరుస్తున్న ప్రభుత్వం వంట గదుల నిర్మాణంపై శ్రద్ధ చూపకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కోసం ప్రత్యేకంగా వంటగదులు నిర్మించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి.
Advertisement
Advertisement