సిద్దిపేట: ‘‘దశాబ్ద కాలం క్రితం అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాం.. పట్టాలు లేక ఇబ్బంది పడ్డాం.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి.. మా లాంటి పేదల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు.. ఆయన చలవతో మేము సొంతింటి వాళ్లమయ్యాం.. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.. అని సిద్దిపేటకు చెందిన పలువురు పేర్కొన్నారు.
పట్టణ శివారులోని 1,340 సర్వేనంబర్‌లో గల అసైన్డ్ భూముల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా కాలంగా నివాసం ఉన్నా ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని భయాందోళన చెందారు. అయితే సీఎం కేసీఆర్ ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం పలువురి పాలిట వరంగా మారింది. సోమవారం మంత్రి హరీశ్‌రావు అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి పట్టాలు పంపిణీ చేశారు.
దీంతో వారు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంపత్‌రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు శివారులోని చైతన్యపూరి తోపాటు పలు కాలనీల ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించడం సంతోషంగా ఉందన్నారు. హక్కుదారులుగా పత్రాలు తమ జీవితాల్లో ఆనందం నింపాయని, ఈ రోజు మాకు పండుగని పలువురు పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు, జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.