
బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్నట్లు..
మెదక్ : మల్లన్నసాగర్ విషయంలో విపక్షాల తీరు బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్న తీరులా ఉందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి స్వీట్లు పంచుకోవడం సరికాదన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, ఆ స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని సూచించారు. మిషన్ భగీరథ పాత పథకం కాదని హరీశ్ రావు అన్నారు. ఒక్క మెదక్ జిల్లాలో ఆ పథకం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని సభకు వచ్చేవాళ్లు మధ్యాహ్నం ఒంటిగంటలోపే చేరుకోవాలన్నారు. ప్రధాని సభకు లక్షా 50వేలమంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపినట్లు హరీశ్ తెలిపారు.