శ్రీనివాసా.! ఇదెక్కడి హామీ! | minister kalava srinivasulu promises of rayadurgam | Sakshi
Sakshi News home page

శ్రీనివాసా.! ఇదెక్కడి హామీ!

Published Thu, Jun 8 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

శ్రీనివాసా.! ఇదెక్కడి హామీ!

శ్రీనివాసా.! ఇదెక్కడి హామీ!

ఆరు నెలల్లో దుర్గం ఆస్పత్రి రూపురేఖలు మారుస్తానన్న మంత్రి కాలవ
మూడేళ్లయినా.. నేటికీ మెరుగపడని వైనం
ప్రతిపాదనలకే పరిమితమైన 50 పడకలు
భర్తీకాని వైద్యులు, నర్సుల పోస్టులు


రాయదుర్గం అర్బన్‌ : ప్రజలను మభ్య పెట్టేందుకు ఏదో ఒక హామీనిచ్చేయడం.. వేదిక దిగగానే దానిని మరిచిపోవడం టీడీపీ ప్రజాప్రతినిధులకు సంప్రదాయంగా మారింది. ఇదే తీరు రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విషయంలోనూ నిజమైంది. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు కేబినెట్‌ హోదా కలిగిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌గాను..  ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన... ఈ మూడేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికీ నెరవేరలేదు.  ఎమ్మెల్యేగా తాను గెలిచిన తొలి రోజున రాష్ట్రంలోనే రాయదుర్గం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటూ ఆయన ఇచ్చిన మాట రాయదుర్గం మురుగు కాలువల్లో కొట్టుకుపోయింది. అదిగో.. ఇదిగో అనే లోపు మూడేళ్లు పూర్తైంది.   ఇంతకాలం నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతూ వచ్చిన ఆయన ఈ రెండేళ్లలో సాధించేదంటూ ఏమీ ఉండదంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.

మారని వైద్యశాల రూపురేఖలు
రెండేళ్ల క్రితం రూ. 3.25 కోట్లతో రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన  చేసిన సమయంలో చీఫ్‌ విప్‌గా ఉన్న కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో రాయదుర్గం ఆస్పత్రి రూపురేఖలు మారుస్తానని హామీనిచ్చారు. ఆరు నెలలు కాదు కదా... ఏకంగా 24 నెలలు గడిచినా.. ఆస్పత్రి రూపురేఖలు ఏ మాత్రం మారలేదు. నూతనంగా నిర్మించిన భవనాన్ని సైతం ప్రారంభించే తీరిక కూడా ఆయనకు లేకపోయింది.  రాయదుర్గంతో పాటు, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్‌ మండలాలకు చెందిన దాదాపు రెండు లక్షల మంది రాయదుర్గంలోని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలపై ఆధారపడి చికిత్సలు పొందుతున్నారు. ఈ ఆస్పత్రికి రోజూ 500 వరకు ఓపీ నడుస్తుండగా.. వీరిలో 60 మంది వరకూ ఇన్‌పెషెంట్‌లుగా చేరుతున్నారు. వీరికి సరిపడ బెడ్‌లు లేకపోవడంతో వరండాలోనే పరుండబెట్టి చికిత్సలు అందజేస్తున్నారు. రోగుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇన్‌పెషెంట్‌లు కోలుకోకముందే డిశ్చార్జ్‌ చేసి ఇళ్లకు పంపించేస్తున్నారు.

పదేళ్లుగా ప్రతిపాదనలే..
పెరిగిన జనాభాను అనుసరించి రాయదుర్గంలోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలంటూ పదేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నా.. దిక్కుమొక్కు లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం ఆస్పత్రి భవన సముదాయానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు సైతం దీనిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తానని హామీనిచ్చి తిరిగి చూడలేదు. మంత్రి ఇలాఖాలో మంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయింది.

భర్తీకి నోచుకోని పోస్టులు
రాయదుర్గం ఆస్పత్రికి సివిల్‌ సర్జన్‌ (గైనకాలజిస్ట్‌), డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ (పిడియాట్రిక్‌), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (గైనిక్‌, పిడియాట్రిస్ట్‌), అనస్థిషియన్‌, జనరట్‌ మెడిసిన్‌, డెంటిస్ట్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏడు పోస్టులకు గాను నేడు ఒక రెగ్యులర్‌ ఎంబీబీఎస్‌, మరో డెంటిస్ట్‌, కాంట్రాక్ట్‌ కింద వచ్చిన ముగ్గురు ఎంబీబీఎస్‌లు ఉన్నారు. దీంతో వైద్యుల పోస్టులు భర్తీ కాక మెరుగైన వైద్యం కలగా మారింది. పని ఒత్తిళ్లను భరించలేని వైద్యులు సైతం ఇక్కడ పనిచేయడానికి సుముఖంగా లేరు. ఆరుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక హెడ్‌ నర్సు ఉండాల్సిన చోట ముగ్గురు స్టాఫ్‌ నర్సులు మాత్రమే పనిచేస్తున్నారు.

రెఫరల్‌ ఆస్పత్రిగానే..
రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రాయదుర్గం ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. క్షతగాత్రులను రాయదుర్గం ఆస్పత్రికి తీసుకువస్తే ప్రథమ చికిత్స చేసి వెనువెంటనే సమీపంలోని బళ్లారి లేదా, జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి రెఫర్‌ చేస్తుంటారు. ఇక్కడ బ్లడ్‌ బ్యాంక్ కూడా లేకపోవడంతో సకాలంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కళ్ల ముందే గాలిలో కలిసిపోతున్నాయి.  నిత్యం 500 రోగులు సందర్శించే ఈ ఆస్పత్రిలో తాగునీటికి గతిలేదు. రెండేళ్లుగా జనరేటర్‌  కూడా పనిచేయడం లేదు. సాంకేతిక కారణాలు తలెత్తి విద్యుత్ సరఫరా ఆగిపోతే చీకట్లోనే రోగులు మగ్గిపోతున్నారు. ఆస్పత్రికి చుట్టూ ఉన్న ప్రహరీని రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేశారు. వాహనాల పార్కింగ్‌ స్థలంలో మట్టి దిబ్బలు వేశారు. అసాంఘిక శక్తులు ఆస్పత్రి ఆవరణంలో అనునిత్యమూ పంచాయితీలు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తుంటారు. పోలీస్‌ ఔట్‌ పోస్టు ఉన్నా.. ఫలితం లేకుండా పోయింది. రాత్రి పూజల రోగులకు భద్రత లేకుండా పోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement