– లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు మంత్రి కాలవ బెదిరింపులు
– తన బినామీకి చెందిన భాస్కర్ ఫర్టిలైజర్స్ గోడౌన్‌లోనే అద్దెకు ఉండాలని హుకుం
– అద్దె అధికం కావడంతో మరో గోడౌన్ యజమానితో అగ్రిమెంట్ చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
– మంత్రి కాలవతో పాటు ఎక్సైజ్ మంత్రి నుంచి కూడా జిల్లా అధికారులకు ఒత్తిళ్లు
– నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేక తల పట్టుకుంటున్న వైనం
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
అధికార పార్టీ నేతలు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నిబంధనలతో పనిలేదు. అధికారులపై గౌరవం లేదు. ‘మా ప్రభుత్వం ఉంది...మేము చెప్పినట్లే జరగాల’నే ధోరణిలో వెళ్తున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖలో లిక్కర్‌గోడౌన్ అగ్రిమెంట్‌కు సంబంధించిన వ్యవహారంలో ఏకంగా మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులకు ఫోన్ చేసి బెదిరించగా, నిజానిజాలతో పనిలేకుండా ఎక్సైజ్ మంత్రి జవహర్ కూడా ఆయనకే వత్తాసు పలికారు. దీంతో ఈ వ్యవహారాన్ని అధికారులు ఆ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు మంత్రుల సిఫార్సులను కమిషనర్ తోసిపుచ్చడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్సైజ్‌శాఖలో మంగళవారం తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం నగర శివారులోని సోములదొడ్డిలో లిక్కర్‌గోడౌన్ ఉంది. 2016 ఏప్రిల్ 26న విద్యుత్ ప్రమాదంలో ఇది కాలిపోయింది. దీంతో గార్లదిన్నె జెడ్పీటీసీ సభ్యురాలు విశాలక్షి భర్త, భాస్కర్ ఫర్టిలైజర్స్ యజమాని భాస్కర్‌కు చెందిన గోడౌన్‌ను అద్దెకు తీసుకున్నారు. గోడౌన్‌ను అద్దెకు తీసుకునేందుకు చదరపు అడుగుకు రూ.8–11 వరకూ అనుమతి ఉంది. దీంతో రూ.8 చొప్పున అద్దె చెల్లించేందుకు ఈ ఏడాది మే 31 వరకూ భాస్కర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ నెలకు రూ.1.12 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. నేటితో అగ్రిమెంట్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండు నెలల కిందట అగ్రిమెంట్ పొడిగింపుపై ఎక్సైజ్ అధికారులు భాస్కర్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఇస్తున్న అద్దెలో 15 శాతం పెంచాలని భాస్కర్ కోరారు. దీంతో ఈ విషయాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయ కమిషనర్‌కు నివేదించారు. అద్దె పెంపు కుదరదని, మరో గోడౌన్ చూసుకోవాలని కమిషనర్ సూచించారు.. దీంతో రామలింగారెడ్డి అనే వ్యక్తికి చెందిన గోడౌన్‌ను నిర్ధారణ చేసుకుని.. చదరపు అడుగుకు రూ.7.50లతో అగ్రిమెంట్ చేసుకున్నారు.
మంత్రి కాలవ ఒత్తిళ్లు
ఎక్సైజ్ అధికారులు 15శాతం పెంచి తమ గోడౌన్‌లోనే కొనసాగుతారని భాస్కర్ భావించారు. అయితే.. మరో గోడౌన్ యజమానితో అగ్రిమెంట్ చేసుకోవడంతో జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా తమ అగ్రిమెంట్ పొడిగించాలంటూ మంత్రి కాలవ శ్రీనివాసులు ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మంగళవారం కాలవ..డీసీ అనసూయకు ఫోన్ చేసి ‘టీడీపీ నేతలకు కాకుండా ఇతరులకు మేలు చేసేలా వ్యవహరిస్తారా? అగ్రిమెంట్ భాస్కర్‌కే అయ్యేలా చూడండి’ అంటూ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే.. అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు రద్దు చేస్తే రామలింగారెడ్డి కోర్టుకు వెళితే ఆయనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని, ఏదైనా ఉంటే కమిషనర్‌తో మాట్లాడాలని బదులిచ్చినట్లు సమాచారం.
దీంతో కమిషనర్ లక్ష్మీనరసింహంతో మంత్రి కాలవ మాట్లాడినట్లు తెలిసింది. మంత్రి సిఫార్సును కమిషనర్ కూడా తోసిపుచ్చారు. అంతటితో ఆగని కాలవ.. ఎక్సైజ్ మంత్రి జవహర్‌తో కూడా డీసీకి ఫోన్ చేయించినట్లు తెలిసింది. జవహర్‌కు కూడా డీసీ అదే సమాధానమిచ్చారు. దీంతో జవహర్ కమిషనర్‌కు ఫోన్ చేశారు. ఆయన సిఫార్సును కూడా కమిషనర్ తోసిపుచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తమ పరిధి మేరకు అద్దెకు సంబంధించిన వ్యవహారంపై చర్చించామని, భాస్కర్ కాదన్న తర్వాతనే మరొకరితో అగ్రిమెంట్ చేసుకున్నామని, కానీ ఇలా మంత్రుల ద్వారా ఒత్తిడి తేవడం సమంజసం కాదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. మంత్రుల ఫోన్లు, అగ్రిమెంట్ వ్యవహారంపై మంగళవారం ఎక్సైజ్‌శాఖలో తీవ్ర చర్చ జరిగింది. కానీ తుదిగా జూన్ ఒకటి నుంచి రామలింగారెడ్డి గోడౌన్‌లోనే మద్యాన్ని నిల్వ చేయనున్నారు.
అధికారం మాది.. చెప్పింది చేయండి!
Published Tue, May 30 2017 11:01 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement