minister kalava srinivasulu
-
‘ఇంటింటా’ నిలదీత
రాయదుర్గం: రాయదుర్గంలో సోమవారం చేపట్టిన ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులుకు చుక్కెదురైంది. ఏ ఇంటికెళ్లినా ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టి ఆయనను నిలదీశారు. మునిసిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డులోని కృష్ణాశ్రమం వద్ద ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సమావేశం ముగియగానే మహిళలు శాంతమ్మ, లక్ష్మీదేవి లేచి ‘వార్డులో పర్యటించండి, అభివృద్ధి గురించి తెలుస్తుంది’ అని మంత్రితో అన్నారు. ‘డ్రెయినేజీలపై ఆక్రమణల తొలగింపు నిబంధనలు సాధారణ ప్రజలకేనా.. టీడీపీ వారికి వర్తించవా’ అంటూ శాంతమ్మ ప్రశ్నించారు. ‘451 ఇళ్లుండే 8వ వార్డులో రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిందని, అందులో పందుల స్వైర విహారం చేస్తుండటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, పట్టించుకునేవారే లేరని లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలో 6వ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ చైర్మన్ అయితే ఆయన ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారు. ప్రస్తుతం 8వ వార్డు కౌన్సిలర్ జ్యోతి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆమె ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయించుకుంటున్నారు. మిగిలిన వార్డు ప్రజలు మనుషులు కారా?’ అని ప్రశ్నించారు. దీంతో మంత్రి వార్డులో కొంతభాగం పర్యటించారు. ఏ ఇంటికెళ్లినా పింఛన్ రాలేదని, ఇళ్లు ఇవ్వలేదని, మరుగుదొడ్లు మంజూరు కాలేదని ఇలా ఏదోక సమస్యను ఏకరువుపెట్టారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పస్తులతో బతుకుబండి లాక్కొస్తున్నామని చేనేతలు వాపోయారు. మూడేళ్లుగా వార్డును పట్టించుకునే వారే లేరని వార్డు ప్రజలంతా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి మాట్లాడుతూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి ముందు 8వ వార్డు ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి. మీకో దండం మంత్రి వద్ద టీడీపీ సీనియర్ నాయకుడి నిర్వేదం సార్.. నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీకే ఓటు వేశాను, అదే పార్టీలోనే ఉన్నాను. ఇప్పటికీ పూరిగుడిసెలోనే ఉంటున్నాను. మగ్గం ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకొక ఇల్లు మంజూరు కాలేదు. ప్రభుత్వం నుం డి ఎలాంటి సహాయ, సహకారాలు లేవు. వార్డులోని ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్తే ఆమె పట్టించుకోవడం లేదు. కనీసం బాడుగ ఇళ్లకు మరుగుదొడ్లయినా మంజూరు చేయమంటే అదీ చేయలేదు. ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు ఈ మేలు చాలు సార్’ అంటూ స్థానికంగా టీడీపీలో సీనియర్ నాయకుడైన చేనేత కార్మికుడు రాజు మంత్రికి దం డం పెట్టారు. ‘ఇప్పుడు నీకేం కావాలి చెప్పు’ అని మంత్రి అడిగినా ‘నాకు ఏమీ వద్దు సార్.. ఇప్పటివరకు పార్టీలో ఇచ్చిన మర్యాద చాలు’ అని నిర్మొహమాటంగా తెగేసి చెప్పారు. అరుణ అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని, కౌన్సిలర్ చుట్టూ, మున్సిపాల్టీ చుట్టూ తిరిగి తిరిగి చేసి అలసిపోయామని అరుణ మంత్రి కాలవ దృష్టికి తీసుకొచ్చింది. పింఛన్ ఇప్పిస్తామని మంత్రి చెప్పగా ‘ఏమో సార్ ఏమిస్తారో? ఎప్పుడిస్తారో?’ అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది. ఆంజనేయులు చేనేత రుణమాఫీ అన్నారని, వడ్డీలేని రుణాలిప్పిస్తామన్నారని, ఏదీ ఇవ్వకపోగా కనీసం నేతన్నలను పట్టించుకునేవారే కరువయ్యారని ఆంజనేయులు మంత్రి వద్ద ఆవేదన చెందారు. ఇంట్లో మగ్గం నేస్తున్న ఆంజనేయులును మంత్రి పలుకరించగా ఆయన ఇలా స్పందించారు. ‘సార్ ఓనర్లతో ముడిసరుకులు తెచ్చి చీరలు నేస్తున్నాం. 15 రోజుల పాటు ఒక చీరను ఇద్దరం నేస్తే రూ.2,500 ఇస్తున్నారు. దాంతోనే బతుకీడ్చుతున్నాం’ అని విచారం వెలిబుచ్చారు. పిల్లల చదువులు భారం అవుతున్నాయని, బ్యాంకు ద్వారా రుణాలిప్పించి ఆదుకోవాలని కోరారు. లక్ష్మీదేవి అద్దె గుడిసెలో ఉన్నామని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుందామని అనుకుంటే పట్టించుకునే వారే లేరని లక్ష్మీదేవి మంత్రితో అన్నారు. ‘అర్హత ఉన్న మా లాంటి నిరుపేదలకు కాకుండా ఇళ్లు ఎవరికిస్తారు? గొప్పలు చెప్పడం కన్నా, స్వయంగా పరిశీలించి అర్హత ఉన్న మాలాంటి వారికి న్యాయం చేయండి సార్’ అని వేడుకున్నారు. చంద్రకళ ‘సార్.. ఎలాంటి సౌకర్యాల్లేని ఈ వార్డులో జీవనం సాగిస్తున్న మా దీనావస్థను ఒకసారి పరికించండి. రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఎక్కడికక్కడ నీరు నిలబడి మురికికూపాలను తలపిస్తున్నాయి. ఆ మురుగులో పడి దొర్లుతున్న పందులను చూడండి. ఈ దుర్వాసనలో ఎలా బతకాలి, రోగాలు రావా?’ అంటూ నిలదీశారు. తాగడానికి నీరు కూడా సక్రమంగా రావడం లేదని, వచ్చినా కలుషితమైనవి వస్తున్నాయని, వాటిని ఎలా తాగాలని ప్రశ్నించారు. -
తక్షణ చర్యలు చేపట్టండి
– రైతులకు పెట్టబడి రాయితీ అందజేయండి – అధికారులకు మంత్రి కాలవ ఆదేశం – కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమావేశం అనంతపురం సిటీ : రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం కలెక్టర్ జి.వీరపాండియన్, వ్యవసాయ శాఖ, బ్యాంక్, బీమా కంపెనీ అధికారులతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఖాతాల్లో జమ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో 24 గంటల పాటు పనిచేసేలా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు. జేసీ–2 ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, బ్యాంకులు, బీమా కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా కమాండ్ కంట్రోల్ రూంలో పని చేయాలన్నారు. ప్రీమియం చెల్లించిన రైతుల డేటాను మ్యాచింగ్ చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని బీమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇన్పుట్ సబ్సిడీ జమ చేసే క్రమంలో నెలకొన్న జాప్యాన్ని అరికట్టాలన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని పక్కగా రైతుల జాబితా రూపొందించి వారి ఖాతాల్లోకి నగదు జమ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, జేడీఏ శ్రీరామ్మూర్తి, ఎల్డీఎం జయశంకర్, బజాజ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు జగదీశ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనివాసా.! ఇదెక్కడి హామీ!
ఆరు నెలల్లో దుర్గం ఆస్పత్రి రూపురేఖలు మారుస్తానన్న మంత్రి కాలవ మూడేళ్లయినా.. నేటికీ మెరుగపడని వైనం ప్రతిపాదనలకే పరిమితమైన 50 పడకలు భర్తీకాని వైద్యులు, నర్సుల పోస్టులు రాయదుర్గం అర్బన్ : ప్రజలను మభ్య పెట్టేందుకు ఏదో ఒక హామీనిచ్చేయడం.. వేదిక దిగగానే దానిని మరిచిపోవడం టీడీపీ ప్రజాప్రతినిధులకు సంప్రదాయంగా మారింది. ఇదే తీరు రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విషయంలోనూ నిజమైంది. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ చీఫ్ విప్‌గాను.. ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన... ఈ మూడేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికీ నెరవేరలేదు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన తొలి రోజున రాష్ట్రంలోనే రాయదుర్గం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటూ ఆయన ఇచ్చిన మాట రాయదుర్గం మురుగు కాలువల్లో కొట్టుకుపోయింది. అదిగో.. ఇదిగో అనే లోపు మూడేళ్లు పూర్తైంది. ఇంతకాలం నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతూ వచ్చిన ఆయన ఈ రెండేళ్లలో సాధించేదంటూ ఏమీ ఉండదంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. మారని వైద్యశాల రూపురేఖలు రెండేళ్ల క్రితం రూ. 3.25 కోట్లతో రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో చీఫ్ విప్‌గా ఉన్న కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో రాయదుర్గం ఆస్పత్రి రూపురేఖలు మారుస్తానని హామీనిచ్చారు. ఆరు నెలలు కాదు కదా... ఏకంగా 24 నెలలు గడిచినా.. ఆస్పత్రి రూపురేఖలు ఏ మాత్రం మారలేదు. నూతనంగా నిర్మించిన భవనాన్ని సైతం ప్రారంభించే తీరిక కూడా ఆయనకు లేకపోయింది. రాయదుర్గంతో పాటు, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్ మండలాలకు చెందిన దాదాపు రెండు లక్షల మంది రాయదుర్గంలోని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలపై ఆధారపడి చికిత్సలు పొందుతున్నారు. ఈ ఆస్పత్రికి రోజూ 500 వరకు ఓపీ నడుస్తుండగా.. వీరిలో 60 మంది వరకూ ఇన్పెషెంట్లుగా చేరుతున్నారు. వీరికి సరిపడ బెడ్లు లేకపోవడంతో వరండాలోనే పరుండబెట్టి చికిత్సలు అందజేస్తున్నారు. రోగుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇన్పెషెంట్లు కోలుకోకముందే డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపించేస్తున్నారు. పదేళ్లుగా ప్రతిపాదనలే.. పెరిగిన జనాభాను అనుసరించి రాయదుర్గంలోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలంటూ పదేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నా.. దిక్కుమొక్కు లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం ఆస్పత్రి భవన సముదాయానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు సైతం దీనిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తానని హామీనిచ్చి తిరిగి చూడలేదు. మంత్రి ఇలాఖాలో మంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయింది. భర్తీకి నోచుకోని పోస్టులు రాయదుర్గం ఆస్పత్రికి సివిల్ సర్జన్ (గైనకాలజిస్ట్), డిప్యూటీ సివిల్ సర్జన్ (పిడియాట్రిక్), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (గైనిక్, పిడియాట్రిస్ట్), అనస్థిషియన్, జనరట్ మెడిసిన్, డెంటిస్ట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏడు పోస్టులకు గాను నేడు ఒక రెగ్యులర్ ఎంబీబీఎస్, మరో డెంటిస్ట్, కాంట్రాక్ట్ కింద వచ్చిన ముగ్గురు ఎంబీబీఎస్‌లు ఉన్నారు. దీంతో వైద్యుల పోస్టులు భర్తీ కాక మెరుగైన వైద్యం కలగా మారింది. పని ఒత్తిళ్లను భరించలేని వైద్యులు సైతం ఇక్కడ పనిచేయడానికి సుముఖంగా లేరు. ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఒక హెడ్ నర్సు ఉండాల్సిన చోట ముగ్గురు స్టాఫ్ నర్సులు మాత్రమే పనిచేస్తున్నారు. రెఫరల్ ఆస్పత్రిగానే.. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రాయదుర్గం ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. క్షతగాత్రులను రాయదుర్గం ఆస్పత్రికి తీసుకువస్తే ప్రథమ చికిత్స చేసి వెనువెంటనే సమీపంలోని బళ్లారి లేదా, జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి రెఫర్ చేస్తుంటారు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా లేకపోవడంతో సకాలంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కళ్ల ముందే గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం 500 రోగులు సందర్శించే ఈ ఆస్పత్రిలో తాగునీటికి గతిలేదు. రెండేళ్లుగా జనరేటర్ కూడా పనిచేయడం లేదు. సాంకేతిక కారణాలు తలెత్తి విద్యుత్ సరఫరా ఆగిపోతే చీకట్లోనే రోగులు మగ్గిపోతున్నారు. ఆస్పత్రికి చుట్టూ ఉన్న ప్రహరీని రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేశారు. వాహనాల పార్కింగ్ స్థలంలో మట్టి దిబ్బలు వేశారు. అసాంఘిక శక్తులు ఆస్పత్రి ఆవరణంలో అనునిత్యమూ పంచాయితీలు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తుంటారు. పోలీస్ ఔట్ పోస్టు ఉన్నా.. ఫలితం లేకుండా పోయింది. రాత్రి పూజల రోగులకు భద్రత లేకుండా పోయింది. -
అధికారం మాది.. చెప్పింది చేయండి!
– లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు మంత్రి కాలవ బెదిరింపులు – తన బినామీకి చెందిన భాస్కర్ ఫర్టిలైజర్స్ గోడౌన్లోనే అద్దెకు ఉండాలని హుకుం – అద్దె అధికం కావడంతో మరో గోడౌన్ యజమానితో అగ్రిమెంట్ చేసుకున్న ఎక్సైజ్ అధికారులు – మంత్రి కాలవతో పాటు ఎక్సైజ్ మంత్రి నుంచి కూడా జిల్లా అధికారులకు ఒత్తిళ్లు – నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేక తల పట్టుకుంటున్న వైనం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) అధికార పార్టీ నేతలు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నిబంధనలతో పనిలేదు. అధికారులపై గౌరవం లేదు. ‘మా ప్రభుత్వం ఉంది...మేము చెప్పినట్లే జరగాల’నే ధోరణిలో వెళ్తున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖలో లిక్కర్గోడౌన్ అగ్రిమెంట్‌కు సంబంధించిన వ్యవహారంలో ఏకంగా మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులకు ఫోన్ చేసి బెదిరించగా, నిజానిజాలతో పనిలేకుండా ఎక్సైజ్ మంత్రి జవహర్ కూడా ఆయనకే వత్తాసు పలికారు. దీంతో ఈ వ్యవహారాన్ని అధికారులు ఆ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు మంత్రుల సిఫార్సులను కమిషనర్ తోసిపుచ్చడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్సైజ్‌శాఖలో మంగళవారం తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగర శివారులోని సోములదొడ్డిలో లిక్కర్గోడౌన్ ఉంది. 2016 ఏప్రిల్ 26న విద్యుత్ ప్రమాదంలో ఇది కాలిపోయింది. దీంతో గార్లదిన్నె జెడ్పీటీసీ సభ్యురాలు విశాలక్షి భర్త, భాస్కర్ ఫర్టిలైజర్స్ యజమాని భాస్కర్‌కు చెందిన గోడౌన్‌ను అద్దెకు తీసుకున్నారు. గోడౌన్‌ను అద్దెకు తీసుకునేందుకు చదరపు అడుగుకు రూ.8–11 వరకూ అనుమతి ఉంది. దీంతో రూ.8 చొప్పున అద్దె చెల్లించేందుకు ఈ ఏడాది మే 31 వరకూ భాస్కర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ నెలకు రూ.1.12 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. నేటితో అగ్రిమెంట్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండు నెలల కిందట అగ్రిమెంట్ పొడిగింపుపై ఎక్సైజ్ అధికారులు భాస్కర్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఇస్తున్న అద్దెలో 15 శాతం పెంచాలని భాస్కర్ కోరారు. దీంతో ఈ విషయాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయ కమిషనర్‌కు నివేదించారు. అద్దె పెంపు కుదరదని, మరో గోడౌన్ చూసుకోవాలని కమిషనర్ సూచించారు.. దీంతో రామలింగారెడ్డి అనే వ్యక్తికి చెందిన గోడౌన్‌ను నిర్ధారణ చేసుకుని.. చదరపు అడుగుకు రూ.7.50లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మంత్రి కాలవ ఒత్తిళ్లు ఎక్సైజ్ అధికారులు 15శాతం పెంచి తమ గోడౌన్లోనే కొనసాగుతారని భాస్కర్ భావించారు. అయితే.. మరో గోడౌన్ యజమానితో అగ్రిమెంట్ చేసుకోవడంతో జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా తమ అగ్రిమెంట్ పొడిగించాలంటూ మంత్రి కాలవ శ్రీనివాసులు ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మంగళవారం కాలవ..డీసీ అనసూయకు ఫోన్ చేసి ‘టీడీపీ నేతలకు కాకుండా ఇతరులకు మేలు చేసేలా వ్యవహరిస్తారా? అగ్రిమెంట్ భాస్కర్‌కే అయ్యేలా చూడండి’ అంటూ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే.. అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు రద్దు చేస్తే రామలింగారెడ్డి కోర్టుకు వెళితే ఆయనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని, ఏదైనా ఉంటే కమిషనర్‌తో మాట్లాడాలని బదులిచ్చినట్లు సమాచారం. దీంతో కమిషనర్ లక్ష్మీనరసింహంతో మంత్రి కాలవ మాట్లాడినట్లు తెలిసింది. మంత్రి సిఫార్సును కమిషనర్ కూడా తోసిపుచ్చారు. అంతటితో ఆగని కాలవ.. ఎక్సైజ్ మంత్రి జవహర్‌తో కూడా డీసీకి ఫోన్ చేయించినట్లు తెలిసింది. జవహర్‌కు కూడా డీసీ అదే సమాధానమిచ్చారు. దీంతో జవహర్ కమిషనర్‌కు ఫోన్ చేశారు. ఆయన సిఫార్సును కూడా కమిషనర్ తోసిపుచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తమ పరిధి మేరకు అద్దెకు సంబంధించిన వ్యవహారంపై చర్చించామని, భాస్కర్ కాదన్న తర్వాతనే మరొకరితో అగ్రిమెంట్ చేసుకున్నామని, కానీ ఇలా మంత్రుల ద్వారా ఒత్తిడి తేవడం సమంజసం కాదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. మంత్రుల ఫోన్లు, అగ్రిమెంట్ వ్యవహారంపై మంగళవారం ఎక్సైజ్‌శాఖలో తీవ్ర చర్చ జరిగింది. కానీ తుదిగా జూన్ ఒకటి నుంచి రామలింగారెడ్డి గోడౌన్లోనే మద్యాన్ని నిల్వ చేయనున్నారు. -
లక్ష ఇళ్లు నిర్మిస్తాం : మంత్రి కాలవ
రాయదుర్గం రూరల్ : ఏడాదిలోగా రాష్ట్రంలో లక్ష ఇళ్లను నిర్మిస్తామని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం బొమ్మక్కపల్లిలో ఆయన పర్యటించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దాణా, మాగుడుగడ్డి వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి పాడిరైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేలు జాతి పశువులను ఎంపిక చేసుకుని ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా బీటి ప్రాజెక్టుకు నీరు తెచ్చేందుకు పాటు పడతామన్నారు. గ్రామంలో ఒక్కరికి కూడా నూతన ఎన్టీఆర్ గృహాలు మంజూరు కాలేదని పలువురు లబ్ధిదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్ : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్ కాస్టింగ్ సంఘం నాయకులు కోరారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర రామాంజినేయులు, కార్యదర్శి ఎ.షఫివుల్లా, బ్రాడ్ కాస్టింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.రామాంజినేయులు, ఇతర నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో హైపర్ కమిటీని ఏర్పాటు చేశారని, అయితే జిల్లాలో కమిటీలు ఏర్పాటు కాలేదన్నారు. ఆరోగ్య బీమా పథకం అమలులో లోపాలుయన్నాయని, సరైన వైద్యం సకాలంలో అందని పరిస్థితి ఉందన్నారు. బీమా పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఇళ్ల స్థలాలు, గ్రామీణ విలేకరులకు పక్కా గృహాలు మంజూరు, తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
హామీలు ‘కాలవ’లోకి..
– ఎండమావిలా ఎడారి నివారణ – డీపీఆర్ సర్వేకే పరిమితమైన బీటీపీ - మంత్రి కాలవ శ్రీనివాసులు పనితీరుపై జనం అసంతృప్తి రాయదుర్గం: ‘అనతికాలంలోనే నన్ను అక్కున చేర్చుకుని ఆదరించిన రాయదుర్గం ప్రజల రుణం తీర్చుకోలేనిది. గత ప్రభుత్వాలు దుర్గం అభివృద్ధిని విస్మరించాయి. నన్ను తమలో ఒకరిగా భావించిన ప్రజలకు ఇంటికి పెద్దకొడుకునై సేవ చేస్తా. అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి , రూపురేఖలు మారుస్తా’ ఇవీ ఎమ్మెల్యే , మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పిన మాటలు. ఎన్నోసార్లు ఈ విషయాలను ఆయన ప్రస్తావించారు. అయితే ఆయన మాటలన్నీ నీటిమీద రాతలే అయ్యాయి. నియోజకవర్గంలో అభివృద్ధి పడకేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు కూడా నత్తనడకన సాగుతుండగా... నీరు చెట్టు కింద నాటిన మొక్కలకు రక్షణే కొరవడింది. పరిశ్రమల ఏర్పాటేదీ? డి.హీరేహాళ్ మండలంలో ఇనుప గనులున్నాయి. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పిన కాలవ హామీ ఉత్తుత్తిగానే మారింది. అలాగే నియోజక వర్గాన్ని జాతీయ రహదారుల్లోకి అనుసం«ధానం చేయడం కోసం కర్నాటకలోని మొలకాల్మూరు నుండి వయా రాయదుర్గం, కళ్యాణదుర్గం మీదుగా అనంతపురం ఎన్‌హెచ్ 4కు అనుసంధానం చేస్తూ నాలుగులైన్ల రోడ్డుకు కృషి చేస్తామని చెప్పినా అది కూడా జరగడం లేదు. ఎండమావిగా ఎడారి నివారణ అనంతపురం జిల్లాలో ఎడారి విస్తరిస్తోందని, ఎడారి నివారణ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రత్యేక బృందాలు రూ.61 కోట్లతో నివేదిక తయారు చేశాయని, ఆ నివేదికను సీఎం చంద్రబాబు ద్వారా కేంద్రప్రభుత్వానికి పంపనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు 2015 జనవరిలో తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తన వంతుగా విడుదల చేసిన రూ.16 కోట్లతో 2015 ఏప్రిల్ 23న పనులను ప్రారంభించారు. అయితే ఆ పనులు తూతూ మంత్రంగా చేపట్టి గాలికొదిలేశారు. సర్వేకే పరిమితం హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు చేరిన కృష్ణ జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో బీటీప్రాజెక్టుకు చేర్చి కరువు రైతు కన్నీటిని తుడిచేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇందులో బాగంగా రూ.1.42 కోట్ల తో డీపీఆర్ సర్వే పనులకు తొలి అడుగు పడిందని 2016 జనవరి 27న ఆర్భాటంగా సర్వే పనులను ప్రారంభించారు. సన్మానాలు, విజయోత్సవ ర్యాలీలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 2016 ఆగస్టులో గుమ్మగట్టకు వచ్చిన సందర్భంగా ఏడాదిలోగా బీటీపీకి నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. తిరిగి 2017 జూన్ 9న ఏరువాక కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన ఆయన ఆగస్టు 15న పనులకు భూమి పూజ చేస్తామని చెప్పారే తప్ప ఆ పనుల పురోగతి గురించి ప్రస్తావనే లేకపోవడం శోచనీయం. మరికొన్ని... గుమ్మగట్టలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా కలగానే మారింది. అలాగే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న గార్మెంట్ రంగానికి విద్యుత్ రాయితీతో పాటు విదేశాలకు ఎగుమతి సౌకర్యం కల్పించి, జీన్స్ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు తెస్తామని కాలవ హామీ మరుగునపడిపోయింది. అలాగే ఇళ్లులేని నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని 2016 మే 1వ తేదీన ఇచ్చిన హామీ అతీగతీలేదు. పనులెక్కడ చేపట్టారు?- గోపాల్ , రైతు , గరుడచేడు ఎడారి నివారణ పనులను గొప్పగా ప్రారంభించినా ఆ పనులు మూణ్ణాళ్లు కూడా జరగలేదు. కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో తెలియదు. రేగడి నేలలకు ఇసుక తరలిస్తే అరకొర వర్షాలకు కూడా తేమ పట్టుకుంటుంది, పంటలు వస్తాయని ఆశతో సొంతంగా ఇసుకను తరలించుకుంటున్నాం. ఒక ట్రాక్టర్ ఇసుకను తరలించడానికి జేసీబీ ఖర్చుతో కలిపి రూ.200 లు భరిస్తున్నాం. దుర్గం అభివృద్ధే నా సంకల్పం - కాలవ శ్రీనివాసులు, మంత్రి దుర్గం అభివృద్ధే నా సంకల్పం. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. బీటీపీకి జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీరు తెచ్చేందుకు డీపీఆర్ సర్వే చేయించాం. అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. మిగిలిన హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి కృషి చేస్తాం.