హామీలు ‘కాలవ’లోకి.. | minister kalava srinivasulu ignore his promises | Sakshi
Sakshi News home page

హామీలు ‘కాలవ’లోకి..

Published Thu, Dec 31 1998 12:00 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

హామీలు ‘కాలవ’లోకి..

హామీలు ‘కాలవ’లోకి..

– ఎండమావిలా ఎడారి నివారణ
– డీపీఆర్‌ సర్వేకే పరిమితమైన బీటీపీ
- మంత్రి కాలవ శ్రీనివాసులు పనితీరుపై జనం అసంతృప్తి


రాయదుర్గం: ‘అనతికాలంలోనే నన్ను అక్కున చేర్చుకుని ఆదరించిన రాయదుర్గం ప్రజల రుణం తీర్చుకోలేనిది. గత ప్రభుత్వాలు దుర్గం అభివృద్ధిని విస్మరించాయి. నన్ను తమలో ఒకరిగా భావించిన ప్రజలకు ఇంటికి పెద్దకొడుకునై సేవ చేస్తా. అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి , రూపురేఖలు మారుస్తా’ ఇవీ ఎమ్మెల్యే , మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పిన మాటలు. ఎన్నోసార్లు ఈ విషయాలను ఆయన ప్రస్తావించారు. అయితే ఆయన మాటలన్నీ నీటిమీద రాతలే అయ్యాయి. నియోజకవర్గంలో అభివృద్ధి పడకేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు కూడా నత్తనడకన సాగుతుండగా... నీరు చెట్టు కింద నాటిన  మొక్కలకు రక్షణే కొరవడింది.

పరిశ్రమల ఏర్పాటేదీ?
డి.హీరేహాళ్‌ మండలంలో ఇనుప గనులున్నాయి. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పిన కాలవ హామీ ఉత్తుత్తిగానే మారింది. అలాగే నియోజక వర్గాన్ని జాతీయ రహదారుల్లోకి అనుసం«ధానం చేయడం కోసం  కర్నాటకలోని మొలకాల్మూరు నుండి  వయా రాయదుర్గం, కళ్యాణదుర్గం మీదుగా అనంతపురం ఎన్‌హెచ్‌ 4కు అనుసంధానం చేస్తూ నాలుగులైన్ల రోడ్డుకు  కృషి చేస్తామని చెప్పినా అది కూడా జరగడం లేదు.

ఎండమావిగా ఎడారి నివారణ
అనంతపురం జిల్లాలో ఎడారి విస్తరిస్తోందని, ఎడారి నివారణ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రత్యేక బృందాలు రూ.61 కోట్లతో నివేదిక తయారు చేశాయని, ఆ నివేదికను సీఎం చంద్రబాబు ద్వారా  కేంద్రప్రభుత్వానికి పంపనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు 2015 జనవరిలో తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తన వంతుగా విడుదల చేసిన రూ.16 కోట్లతో 2015 ఏప్రిల్‌ 23న పనులను ప్రారంభించారు. అయితే ఆ పనులు తూతూ మంత్రంగా చేపట్టి గాలికొదిలేశారు.

సర్వేకే పరిమితం
హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లి  రిజర్వాయర్‌ కు చేరిన కృష్ణ జలాలను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో బీటీప్రాజెక్టుకు చేర్చి కరువు రైతు కన్నీటిని  తుడిచేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇందులో బాగంగా రూ.1.42 కోట్ల తో డీపీఆర్‌ సర్వే పనులకు తొలి అడుగు పడిందని 2016 జనవరి 27న ఆర్భాటంగా సర్వే పనులను ప్రారంభించారు. సన్మానాలు, విజయోత్సవ ర్యాలీలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 2016 ఆగస్టులో గుమ్మగట్టకు వచ్చిన సందర్భంగా ఏడాదిలోగా బీటీపీకి నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. తిరిగి 2017 జూన్‌ 9న ఏరువాక కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన ఆయన ఆగస్టు 15న పనులకు భూమి పూజ చేస్తామని చెప్పారే తప్ప ఆ పనుల పురోగతి  గురించి ప్రస్తావనే లేకపోవడం శోచనీయం.

మరికొన్ని...
గుమ్మగట్టలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా కలగానే మారింది. అలాగే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న గార్మెంట్‌ రంగానికి విద్యుత్‌ రాయితీతో పాటు విదేశాలకు ఎగుమతి సౌకర్యం కల్పించి, జీన్స్‌ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు తెస్తామని కాలవ హామీ మరుగునపడిపోయింది. అలాగే ఇళ్లులేని నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని 2016 మే 1వ తేదీన ఇచ్చిన హామీ అతీగతీలేదు.

పనులెక్కడ చేపట్టారు?-  గోపాల్‌ , రైతు , గరుడచేడు
ఎడారి నివారణ పనులను గొప్పగా ప్రారంభించినా ఆ పనులు మూణ్ణాళ్లు కూడా జరగలేదు. కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో తెలియదు. రేగడి నేలలకు ఇసుక తరలిస్తే అరకొర వర్షాలకు కూడా తేమ పట్టుకుంటుంది, పంటలు వస్తాయని ఆశతో సొంతంగా ఇసుకను తరలించుకుంటున్నాం. ఒక ట్రాక్టర్‌ ఇసుకను తరలించడానికి జేసీబీ ఖర్చుతో కలిపి రూ.200 లు భరిస్తున్నాం.

దుర్గం అభివృద్ధే నా సంకల్పం -  కాలవ శ్రీనివాసులు, మంత్రి
దుర్గం అభివృద్ధే నా సంకల్పం. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. బీటీపీకి జీడిపల్లి రిజర్వాయర్‌ నుండి నీరు తెచ్చేందుకు డీపీఆర్‌ సర్వే చేయించాం. అధికారులు  ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. మిగిలిన హామీలు కూడా ఒక్కొక్కటిగా  నెరవేర్చడానికి కృషి చేస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement