జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్ : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్ కాస్టింగ్ సంఘం నాయకులు కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర రామాంజినేయులు, కార్యదర్శి ఎ.షఫివుల్లా, బ్రాడ్ కాస్టింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.రామాంజినేయులు, ఇతర నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో హైపర్ కమిటీని ఏర్పాటు చేశారని, అయితే జిల్లాలో కమిటీలు ఏర్పాటు కాలేదన్నారు. ఆరోగ్య బీమా పథకం అమలులో లోపాలుయన్నాయని, సరైన వైద్యం సకాలంలో అందని పరిస్థితి ఉందన్నారు. బీమా పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఇళ్ల స్థలాలు, గ్రామీణ విలేకరులకు పక్కా గృహాలు మంజూరు, తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.