ప్రతిపక్ష నేతకు ఆ హక్కు ఉంది: మాణిక్యాలరావు
- వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పై షాకింగ్ కామెంట్
రావులపాలెం (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రులను కలవొచ్చని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి అవాంతరాలు కల్పించే అవకాశం లేదని, దీనిపై టీడీపీ నేతలు, ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర మంత్రులను, అధికారులను కలిసే అర్హత వైఎస్ జగన్ కు లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని విలేకరులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు.
ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి, ఇతర మంత్రులను, అధికారులను కలవడం సాధారణ విషయమేనన్నారు. యనమల మంచి పార్లమెంటేరియన్ అని, పార్లమెంటరీ సంప్రదాయూలపై అవగాహన కలిగిన ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. వైఎస్ జగన్‌కు అర్హత లేదన్నప్పుడు రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సమయంలో ఆహ్వాన పత్రం ఇచ్చేందుకు మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లను ప్రభుత్వం ఎందుకు పంపిందని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ఆ పార్టీ విజ్ఞతకు సంబంధించిన విషయమన్నారు. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం వస్తున్నామనడం వారి విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే ఆలోచించి నిర్ణయం తీసుకొంటామన్నారు. బీజేపీ మద్దతు అవసరం లేకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొంటున్నారా అని ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం లేదని, మిత్రపక్షంగా మాత్రమే కలసి ఉన్నామని చెప్పారు. కేంద్రంలో మద్దతుకు, రాష్ట్రంలో మద్దతుకు సంబంధం లేదని మంత్రి అన్నారు.
కృష్ణా పుష్కరాలకు రూ.150 కోట్లు
ఈ ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలకు దేవాదాయ శాఖ ద్వారా రూ.150 కోట్లు కేటాయించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. ఈ నిధులతో సుమారు 500 దేవాలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేస్తామన్నారు. విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.