-
గత ఏడాది స్వాతంత్య్ర వేడుకల్లో యనమల ప్రగతి బాసలు
-
ఏడాది దాటినా అమలుకు నోచని హామీలు
-
వ్యవసాయంలో తిరోగమనం
-
పట్టాలెక్కని ప్రాజెక్టులు
-
పునాదులకూ నోచని గూడు
వినువీధిలో రెపరెపలాడుతున్న మువ్వన్నెల పతాకం సాక్షిగా.. అమాత్యుడు ఇచ్చిన హామీలు గాలిలో కలిశాయి. ‘ప్రగతి దారుల్లో పయనిద్దాం’ అంటూ ఆయన చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. గత ఏడాది స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు.. జిల్లా అభివృద్ధిపై చేసిన బాసలు.. ఇప్పటికీ తీరని ఆశలుగానే మిగిలిపోయాయి. మళ్లీ నేడు స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కాలంలో ‘తూర్పు’.. ప్రగతి పట్టాలు తప్పి.. తిరోగమన దారుల్లో పయనిస్తున్న సత్యం అధికారుల లెక్కలు సాక్షిగా కళ్లెదుట సాక్షాత్కరిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
గత ఏడాది కాకినాడ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. జిల్లా అభివృద్ధిపై సుమారు 45 నిమిషాలపాటు ప్రసంగించారు. ప్రగతి దారుల్లో పయనిద్దామని అన్నారు. కానీ, ఆయన ప్రసంగం ఒట్టి మాటలకే పరిమితమైంది. నాడు ఆయన ప్రసంగంలో పేర్కొన్న అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే అనేక రంగాల్లో జిల్లా తిరోగమనంలో పయనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
వ్యవసాయంలో మూడో స్థానం
వ్యవసాయ రంగంలో జిల్లాను మొదటి స్థానానికి తీసుకువస్తామని నాడు యనమల చెప్పారు. కానీ ప్రస్తుతం ఈ రంగంలో జిల్లా మూడో స్థానానికే పరిమితమైంది. మరోపక్క కోనసీమ రైతులు పంటవిరామం ప్రకటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు
వ్యవసాయ రంగ అభివృద్ధికి పోలవరం సహా అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తామని అప్పట్లో చెప్పారు. కానీ నేటికీ అనేక సాగునీటి ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. యనమల సొంత నియోజకవర్గం తునిలో తాండవ రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేసిన దాఖలాలు లేవు. 2003లో కుడి కాలువ పొడిగింపునకు శంకుస్థాపన చేసిన విషయాన్ని యనమల మరిచారని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ కూడా ఆధునికీకరణకు నోచలేదు. నిర్వహణకు అవసరమైన నిధులు అందక చాగల్నాడు ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. మోటార్ల మరమ్మతులకు రూ.6.50 కోట్లు కేటాయించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
అంతంతమాత్రంగా పారిశ్రామిక ప్రగతి
జిల్లా ప్రగతిలో పారిశ్రామిక రంగం చాలా కీలకమని, ఈ రంగంలో జిల్లాను మొదటి స్థానానికి తీసుకువెళ్తామని అప్పట్లో యనమల చెప్పారు. కానీ గతంలోలాగే ప్రస్తుతం ఈ రంగంలో జిల్లా రెండో స్థానానికి పరిమితమైంది. ఈ రంగంలో ఈ ఏడాది కొత్తగా సాధించిన ప్రగతి అంటూ ఏమీ లేదని అధికారిక లెక్కలనుబట్టి తెలుస్తోంది.
కానరాని కొత్త పోర్టు
సింగపూర్ వంటి తూర్పు దేశాలకు కాకినాడ తీరమే అతి దగ్గరని, కాకినాడలో ఉన్న రెండు పోర్టులకు అదనంగా మరో రెండు పోర్టులు వస్తున్నాయని నాడు యనమల చెప్పారు. కనీసం ఒక్క పోర్టు కూడా ఇంతవరకూ రాలేదు.
దిగజారిన సేవారంగం
సేవారంగాన్ని మరింత మెరుగు పరుస్తామని అప్పట్లో యనమల చెప్పారు. కానీ ఈ రంగంలో జిల్లా గత సంవత్సరం మూడో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది నాలుగో స్థానానికి దిగజారిపోయింది.
ఒక్క ఇల్లూ రాలేదు
పేదల గృహ నిర్మాణం కింద జిల్లాలో 9,103 ఇళ్లు నిర్మిస్తున్నామని అప్పట్లో యనమల చెప్పారు. ఎన్‌టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా జిల్లాకు 9,999 ఇళ్లు కేటాయించారు. కానీ ఈ ఏడాది కాలంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు.
డ్వాక్రా మహిళలకు మొండిచేయి
డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి రాయితీగా రూ.200 కోట్లు, వడ్డీ రాయితీగా రూ.96 కోట్లు మంజూరు చేశామని ఆనాడు యనమల ప్రకటించారు. ఆ మాటలు నమ్మి ప్రతి సభ్యురాలూ తన ఖాతాలో రూ.10 వేలు జమ అవుతాయని భావించారు. కానీ ప్రభుత్వం మొదటి విడతగా ప్రతి సభ్యురాలికి రూ.3 వేలు మాత్రమే జమ చేసి చేతులు దులుపేసుకుంది. రూ.96 కోట్ల వడ్డీ రాయితీ ఇస్తామని యనమల చెప్పగా 2014–15కు 62,428 సంఘాలకు రూ.80.31 కోట్లు మాత్రమే జమ చేశారు.
‘స్మార్ట్’ కాలేదు
జిల్లాలో 655 స్మార్ట్ వార్డులు ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకూ ఆయా వార్డులకు ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అధికారులు, ఇతరుల భాగస్వామ్యంతో జిల్లాలో స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డులు అభివృద్ధి చేస్తామని చెప్పారు. 1433 గ్రామ, వార్డులకుగానూ 969 గ్రామ, వార్డుల దత్తత జరిగింది. ప్రస్తుతం వాటిల్లో అభివృద్ధి శూన్యంగానే కనిపిస్తోంది.
విద్యారంగం
పాఠశాలలకు 937 అదనపు గదులు మంజూరయ్యాయని నాడు యనమల చెప్పారు. ఈ ఏడాది కాలంలో వాటిలో 686 గదులు మాత్రమే పూర్తయ్యాయి. 99 గదులు స్లాబ్ లెవెల్‌లో నిలిచిపోయాయి. 151 గదుల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభమే కాలేదు.
బాలికల కోసం 765 టాయిలెట్లు నిర్మిస్తున్నామని యనమల అప్పట్లో ప్రకటించారు. తీరా చూస్తే 577 మాత్రమే పూర్తయ్యాయి. 188 టాయిలెట్స్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి.
యనమల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సోమవారం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ ఆచరణకు నోచలేదు. ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గోనున్నారు. ఇప్పుడు ఆయన ఏ హామీలు ఇస్తారో చూడాలి.